రిషి సునాక్ ఓటమి....బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు.
బ్రిటన్ కొత్త ప్రధానిగా కన్సర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ పై 21 వేల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా, రిషి సునాక్ కు 60,399 ఓట్లు లభించాయి. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆమె విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఆర్ధిక మంత్రిగా పని చేసిన రిషి సునాక్ ముందు నుంచీ ట్రస్ కు గట్టి పోటీ ఇచ్చారు. అయితే సునాక్ శ్వేత జాతీయుడు కాకపోవడం, బోరిస్ జాన్సన్ లిజ్ ట్రస్ కు మద్దతు ఇవ్వడం ఆమెకు కలిసి వచ్చింది. వివాదాలు, ప్రజావ్యతిరేకత కారణంగా బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నిక జరిగింది. కన్జర్వేటివ్ పార్టీకి అధినేతగా ఎన్నికయ్యే వ్యక్తే బ్రిటన్ ప్రధాని అవుతారన్న నేపథ్యంలో, లిజ్ ట్రస్ సొంత పార్టీ సభ్యులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచారు. తక్కువ పన్నులు, స్వేచ్ఛగా మన జీవితాలను మనమే సమర్ధంగా నడిపించుకునేలా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని లిజ్ ట్రస్ తన ఎన్నిక ప్రకటన రాగానే మాట్లాడుతూ హమీ ఇచ్చారు.
"మీ పార్టీ నాయకురాలిగా మేము వాగ్దానం చేసిన వాటిని నెరవేర్చాలని నేను భావిస్తున్నాను. పన్నులను తగ్గించి, మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేను ఒక సాహసోపేతమైన ప్రణాళికను రూపొందిస్తాను. ఇంధన సంక్షోభాన్ని అధిగమిద్దాం. " అని ఆమె అన్నారు. ఆరోగ్య సేవలను అందజేస్తానని కూడా ఆమె తెలిపారు. ఇప్పటికే తన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రేపు ఆమె బోరిస్ జాన్సన్ నుండి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారంనాడు తొలిసారిగా ఆమె ప్రధాని హోదాలో పార్లమెంటు నుంచి ప్రసంగించనున్నారు.
అయితే లిజ్ ట్రస్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న బ్రిటన్ లో ద్రవ్యోల్బణం 10.1 శాతానికి పైగా చేరుకుని ప్రజా జీవితాన్ని కకావికలం చేస్తోంది. ఇప్పుడీ సంక్షోభం నుంచి దేశాన్ని ట్రస్ ఎలా ముందుకు నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా జాన్సన్ హయాంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన ఆమె ప్రత్యర్ధి రిషి సునాక్ కొత్త ప్రభుత్వంలో పనిచేయనని స్పష్టం చేశారు.