Telugu Global
International

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినట్లు ట్రస్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నమ్మకాన్ని కూడా తాను కోల్పోయానని వ్యాఖ్యానించారు.

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
X

యూకే ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటీవ్ పార్టీ ప్రతినిధులు ఆమెను ప్రధానిగాఎన్నుకొని ఆరు వారాలు గడవక ముందే గురువారం పదవిని వదిలేస్తున్నట్లు ప్రకటించడం యూకేలో ప్రకంపనలు సృష్టించింది. ట్రస్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన కార్యాలయం బయట విలేకరులతో మాట్లాడిన ట్రస్.. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నమ్మకాన్ని కూడా తాను కోల్పోయానని వ్యాఖ్యానించారు.

'కన్జర్వేటీవ్ పార్టీ సభ్యులకు, ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాను. తనను ఎందుకు ఎన్నుకున్నారో దానికి న్యాయం చేయలేక పోతున్నాను. అందుకే తన రాజీనామాను గుర్తించమని బ్రిటన్ రాజు చార్లెస్‌ను కోరాను' అని ట్రస్ వెల్లడించారు. ఇవ్వాళ ఉదయం 1992 కమిటీ చైర్మన్ సర్ గ్రాహమ్ బార్డీని కలిశానని.. వారంలోగా కొత్త లీడర్‌ను ఎన్నుకునే ప్రక్రియ పూర్తి చేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. దీని వల్ల దేశ ఆర్థిక ప్రణాళికలు, ఎకానమీ స్టెబిలిటీ, దేశ రక్షణకు విఘాతం కలగకుండా ఉంటుందని ట్రస్ వివరించారు.

ఆరు వారాలు ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పాలసీ కార్యక్రమాల కారణంగా బ్రిటన్ ఎకానమీ దారుణంగా దెబ్బతిన్నది. అంతే కాకుండా ఇది ట్రస్‌కు, కన్జర్వేటీవ్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గత శుక్రవారం ఆమె కేబినెట్‌లోని నలుగురు సీనియర్ మంత్రులు రాజీనామా చేశారు. లిజ్ ట్రస్ ఎకనామిక్ పాలసీలను కొత్త ఫైనాన్స్ మినిస్టర్ బుట్టదాఖలు చేశారు. ఇది దేశానికి ఏ మాత్రం ఉపయోగకరం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే ట్రస్ రాజీనామా చేస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇంత త్వరగా ట్రస్ నిర్ణయం తీసుకుంటారని మాత్రం ఎవరూ ఊహించలేదు.

First Published:  20 Oct 2022 1:11 PM GMT
Next Story