మహిళా ఉద్యోగుల్ని టార్గెట్ చేసిన మస్క్.. ట్విట్టర్ పై మళ్లీ కేసులు
ఉద్దేశపూర్వకంగా ట్విట్టర్ నుంచి మహిళలను అధిక సంఖ్యలో తొలగించారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని తొలగింపులు ఉన్నాయని అంటున్నారు.
ట్విట్టర్ ని మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ప్రతిరోజూ ట్విట్టర్ వ్యవహారాలు వార్తల్లో నిలుస్తున్నాయి. మస్క్ రావడంతోనే కాస్ట్ కటింగ్ అంటూ దాదాపు 3700మంది ఉద్యోగులపై వేటు వేశారు. ఆ తర్వాత ఆయన వ్యవహారం నచ్చక వందలాది మంది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకున్నారు. వారికి పరిహారం కూడా ట్విట్టర్ చెల్లించింది. కానీ ఇప్పుడు ఇద్దరు మాజీ మహిళా ఉద్యోగులు మరోసారి కోర్టుకెక్కారు. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని, ఆ విషయంలో తాము లింగవివక్షను ఎదుర్కొన్నామని వారు ఆరోపించారు. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మహిళా ఉద్యోగులు షానన్ లిస్, రియోర్డాన్.
మహిళా ఉద్యోగులే టార్గెట్..
ట్విట్టర్లో ఉద్యోగుల్ని తొలగించడంలో మస్క్ వివక్ష చూపించారనేది మహిళా ఉద్యోగుల ప్రధాన ఆరోపణ. పురుషులతో పోల్చి చూస్తే మహిళల్నే అధికంగా తొలగించారని అంటున్నారు. పురుష ఉద్యోగుల్లో తొలగింపు 48శాతానికి పరిమితం కాగా, మహిళల్లో అది 63శాతానికిపైగా ఉందని సాక్ష్యాధారాలతో సహా వారు కోర్టుకెక్కారు. ఈ విషయంలో ఫెడరల్, కాలిఫోర్నియా చట్టాలను మస్క్ ఉల్లంఘించారని ఉద్యోగులు పేర్కొన్నారు. షానన్ లిస్, రియోర్డాన్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
ఉద్యోగాల్లో చేర్చుకునే సమయంలో ప్రతిభ ఎలా కొలమానం అవుతుందో, ఉద్యోగాల్లోనుంచి తీసేసే సమయంలో కూడా తక్కువ ప్రతిభ ఉన్నవారిని మాత్రమే తొలగించాల్సి ఉంటుందని, కానీ ఉద్దేశపూర్వకంగా ట్విట్టర్ నుంచి మహిళలను అధిక సంఖ్యలో తొలగించారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని తొలగింపులు ఉన్నాయని అంటున్నారు. గతంలో కూడా వారిద్దరు ఇలాంటి కేసులు వేశారు. కోర్టుకెక్కిన ట్విట్టర్ ఉద్యోగులకు ఆ మహిళలిద్దరూ ప్రతినిధులుగా ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కి అర్థాంతరంగా ముగింపు పలికి, పనిగంటలు పెంచడం ద్వారా ఉద్యోగుల్ని మస్క్ హింసించారని అంటున్నారు. అయితే ట్విట్టర్ గతంలో వచ్చిన ఆరోపణలను ఖండించినా, తాజాగా లింగ వివక్షత ఆరోపణలపై మాత్రం ఇంకా స్పందించలేదు.