Telugu Global
International

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 41 మంది మృతి.. - మృతుల్లో పలువురు భారతీయులు

ఈ ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. తమ రాయబారి బాధితులను తరలించిన ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు.

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 41 మంది మృతి.. - మృతుల్లో పలువురు భారతీయులు
X

కువైట్‌లోని మంగాఫ్‌ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతిచెందారు. మరో 50 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. కార్మికులు నివాసముంటున్న భవనంలో ఉదయం 6 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందినవారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలిసింది.

ఈ ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. తమ రాయబారి బాధితులను తరలించిన ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు. తదుపరి సమాచారం కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. మరోపక్క కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్‌ను జారీ చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, గాయపడినవారి విషయంలో రాయబార కార్యాలయం పూర్తి సహాయాన్ని అందజేస్తుందని చెప్పారు.

అగ్నిప్రమాదం సంభవించిన భవనాన్ని కార్మికులను ఉంచడానికి ఉపయోగిస్తున్నారని, అక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదం నుంచి డజన్ల కొద్దీ కార్మికులను రక్షించారని, కానీ దురదృష్టవశాత్తూ మంటల నుంచి వెలువడిన పొగ పీల్చడం వల్ల చాలా మంది మరణించారని తెలిపింది. మంటలను అదుపులోకి తెచ్చిన అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  12 Jun 2024 6:09 PM IST
Next Story