Telugu Global
International

ఊరంతా ఈలలతోనే పిలుచుకుంటారు!

ఇది అక్కడి వారికి తేలిగ్గానే అర్థ‌మైపోతుంటుంది. ఇక్కడి పిల్లలకు చిన్నతనం నుంచే ఈలలతో పిలవడం అలవాటు చేయడంతో వాళ్లు పెరిగి పెద్దయ్యాక కూడా అదే ఈల భాషతో మాట్లాడతారు.

ఊరంతా ఈలలతోనే పిలుచుకుంటారు!
X

ఎవరినైనా పిలవాలంటే పేరు పెట్టి పిలుస్తాం. కానీ ఈ ఊళ్లో అలా కాదు, విజిల్ వేయాలి. అది కూడా ఒక్కొక్కరికి ఒక్కోరకంగా. ఇక్కడి మనుషులకు పేర్లకు బదులు ట్యూన్స్ ఉంటాయి. ఆయా ట్యూన్స్‌తో పిలిస్తేనే ఇక్కడి వాళ్లు పలుకుతారు.

మేఘాలయలోని షిల్లాంగ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఖాసీ కొండ ప్రాంతంలో ఉన్న కాంగ్‌తాంగ్ గ్రామాన్నీ 'విజ్లింగ్ విలేజ్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి మనుషులంతా విజిల్స్‌తోనే పిలుచుకుంటారు మరి.

రెండు పేర్లు

కాంగ్‌తాంగ్ ఊరిలో ఉండే ప్రతి ఒక్కరికి రెండు పేర్లుంటాయి. ఒకటి మామూలు పేరు. రెండోది ప్రత్యేకమైన ట్యూన్ పేరు. వీళ్లు ఒక్కో సమయంలో ఒక్కో రకంగా విజిల్ వేస్తారు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా విజిల్ వేసి పిలుస్తారు. ఇది అక్కడి వారికి తేలిగ్గానే అర్థ‌మైపోతుంటుంది. ఇక్కడి పిల్లలకు చిన్నతనం నుంచే ఈలలతో పిలవడం అలవాటు చేయడంతో వాళ్లు పెరిగి పెద్దయ్యాక కూడా అదే ఈల భాషతో మాట్లాడతారు.

ఇలా మొదలైంది

అందమైన, ఎత్తైన కొండలతో నిండి ఉండే కాంగ్‌తాంగ్ ప్రాంతంలో దాదాపు ఐదొందల మంది నివసిస్తుంటారు. వీళ్లకు బయటి వారితో సంబంధాలు తక్కువ. ఒకప్పుడు కాంగ్‌తాంగ్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శత్రువులను తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాడు. సాయం కోసం తన స్నేహితులను ఈల శబ్దంతో పిలిచాడు. ఆ శబ్దాలను శత్రువు గుర్తించలేకపోయాడు. అలా ఈ సంఘటన తరువాత ఈల భాష వెలుగులోకి వచ్చిందని అక్కడి వాళ్లు చెప్తుంటారు.

'విజ్లింగ్ విలేజ్ ఆఫ్ ఇండియా'గా పాపులర్ అయిన ఈ గ్రామం గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది స్కాలర్లు రీసెర్చ్ చేశారు. జర్మనీ, అమెరికా, జపాన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఇక్కడి ప్రజలను, వీరి ఈల భాషను అధ్యయనం చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా.

First Published:  25 July 2022 2:35 PM IST
Next Story