Telugu Global
International

అమెరికాకు దక్షిణ కొరియా ఓ తోడు దొంగ.. కిమ్ సోదరి సంచలన వ్యాఖ్యలు

ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దక్షిణ కొరియా, అమెరికాలపై తీవ్రమైన విమర్శలు చేశారు.

అమెరికాకు దక్షిణ కొరియా ఓ తోడు దొంగ.. కిమ్ సోదరి సంచలన వ్యాఖ్యలు
X

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. అదే విధంగా అమెరికా అన్నా కూడా ఉత్తర కొరియా అంతెత్తున లేస్తుంది. ఇన్నాళ్లూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మాత్రమే ఈ రెండు దేశాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఈ రెండు దేశాలపై అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడితో పాటు అక్కడి ప్రభుత్వాన్ని 'మూర్ఖులు'గా అభివర్ణించారు. అమెరికా చెప్పినట్లుగా దక్షిణ కొరియా ఆడుతోందని, ఆ దేశానికి దక్షిణ కొరియా ఒక తోడు దొంగ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర కొరియాలోని అధికార పార్టీలో కిమ్ యో జోంగ్ శక్తివంతమైన నేతగా ఉన్నారు. అధ్యక్షుడు కిమ్ తీసుకునే నిర్ణయాల్లో ఆయన సోదరి యో జోంగ్ భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దక్షిణ కొరియా, అమెరికాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. దక్షిణ కొరియా కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్, ఆయన ప్రభుత్వంలోని వాళ్లంతా మూర్ఖులే అని చెప్పారు. వాళ్లు మాకు ఎప్పుడూ ప్రమాదకరమైన పరిస్థితులను కల్పిస్తూ ఉన్నారు. గతంలో దక్షిణ కొరియాకు మూన్ జే-ఇన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆమె ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదు. పైగా అప్పుడు దక్షిణ కొరియా మా లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు.

అయితే, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత మాత్రం మాటల యుద్దం సాగిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తూ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఉత్తర కొరియాకు చెందిన 16 మంది వ్యక్తులు, 15 సంస్థలపై దక్షిణ కొరియా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యలోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని తెలుస్తున్నది.

కిమ్ యో జోంగ్ వ్యాఖ్యలపై దక్షిణ కొరియా తీవ్రంగా మండి పడింది. తమ అధ్యక్షుడు, ప్రభుత్వంపై అవమానకరంగా మాట్లాడటం శోచనీయం అన్నది. ఆమె వ్యాఖ్యలు తమ ప్రభుత్వాన్ని బెదిరించినట్లుగా.. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకులు ప్రేరేపించేలా ఉన్నాయని మండిపడింది.కాగా, గతంలో కూడా అమెరికా, దక్షిణ కొరియాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ఖండించాలని ఐక్యరాజ్య సమితిపై అమెరికా ఒత్తిడి తెచ్చిందని మండిపడింది. అమెరికాను కుక్కతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

First Published:  25 Nov 2022 7:34 AM IST
Next Story