భారీ మొత్తంలో సూసైడ్ డ్రోన్ల ఉత్పత్తికి కిమ్ ఆదేశం
అత్యంత తేలికగా వినియోగించే శక్తిమంతమైన ఆయుధంగా కిమ్ అభివర్ణించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కథనం
పెద్ద మొత్తంలో ఆత్మాహుతి డ్రోన్లను తయారుచేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ఇప్పటికే రష్యాతో కలిసి ఉక్రెయిన్ సరిహద్దులోకి చేరిన ప్యాంగ్‌యాంగ్ సేనలు చేరిన కిమ్ ఆదేశాలు అగ్నికి ఆజ్యం పోసేలా ఆందోళనకరంగా మారాయి. కిమ్ నిన్న ఓ ఆత్మాహుతి డ్రోన్ పరీక్షలో నేరుగా పాల్గొన్నారు. భూఉపరితలంపై, సముద్రంలోని లక్ష్యాలను ఆ డ్రోన్ ఛేదించింది. ఆ మర్నాడే సూసైడ్ డ్రోన్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయాలని ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. వీలైనంత వేగంగా డ్రోన్ల ఉత్పత్తిని మొదలుపెట్టాలని ఆయన నొక్కి చెప్పినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కథనంలో పేర్కొన్నది. అత్యంత తేలికగా వినియోగించే శక్తిమంతమైన ఆయుధంగా దీన్ని కిమ్ అభివర్ణించారని తెలిపింది.
ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర కొరియా మొదటిసారి ఆత్మహుతి డ్రోన్లను ప్రదర్శించింది. రష్యాతో సహకారంతో సంపాదించిన టెక్నాలజీతో వాటిని ఉత్తరకొరియా నిర్మించినట్లు నాడు పలువురు నిపుణులు పేర్కొన్నారు. 2022లోనూ కిమ్ సేనలు చిన్న చిన్న డ్రోన్ల సమూహాన్ని దక్షిణ కొరియా సరిహద్దులకు తరలించాయి. అప్పుడు వాటిని కూల్చలేక సియోల్ సేనలు అవస్థలు పడ్డాయి. ఆ తర్వాత ఆ దేశం డ్రోన్ ఆపరేషన్స్ కమాండ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.