Telugu Global
International

ఆ భారీ స్టేడియం కూల్చివేతకు నిర్ణయం.. కారణం ఇదే

కంజురుహాన్ ఫుట్‌బాల్ స్టేడియంను పునర్నిర్మించడానికి, దేశంలో ఫుట్‌బాల్‌ను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తామని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో హామీ ఇచ్చారు.

ఆ భారీ స్టేడియం కూల్చివేతకు నిర్ణయం.. కారణం ఇదే
X

ఇండోనేషియాలో ఇటీవల పెను విషాదానికి కారణమైన ఫుట్‌బాల్ స్టేడియంను కూల్చివేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జోకో విడోడో ప్రకటించారు. క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదానికి కేంద్రంగా నిలిచింది జకర్తాలోని కంజురుహాన్ స్టేడియం. ఇటీవల ఆ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 133 మంది ప్రాణాలు కోల్పోయారు. సరైన భద్రతా ప్రమాణాలతో స్టేడియం నిర్మించకపోవడం వల్లే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు నిపుణులు తేల్చారు. ఈ స్టేడియంను కూల్చేసి.. అక్కడే అత్యంత భద్రతా ప్రమాణాలతో సరికొత్త స్టేడియంను నిర్మిస్తామని విడోడో స్పష్టం చేశారు.

కంజురుహాన్ ఫుట్‌బాల్ స్టేడియంను పునర్నిర్మించడానికి, దేశంలో ఫుట్‌బాల్‌ను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తామని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో హామీ ఇచ్చారు. ఇండోనేషియాలో వచ్చే ఏడాది అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఆయన విడోడోతో భేటీ అయ్యారు. అయితే అప్పటిలోగా స్టేడియం నిర్మాణం పూర్తి అవుతుందా లేదా అనే విషయాన్ని అధ్యక్షుడు తెలియజేయలేదు. ఫుట్‌బాల్ చరిత్రలో 133 మంది చనిపోవడం ఒక చీకటి రోజని ఇన్‌ఫాంటినో అభివర్ణించారు. ఫిఫా ప్రమాణాలతో కొత్త స్టేడియం నిర్మించనున్నారని.. ప్రేక్షకులు, క్రీడాకారుల భద్రతకే పెద్ద పీట వేయనున్నట్లు ఆయన చెప్పారు.

ఇండోనేషియాలో ఫుల్‌బాల్ క్రీడలో మరిన్ని సంస్కరణలు తీసుకొని రావల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. మ్యాచ్‌ల నిర్వహణలో కూడా మార్పులు తీసుకొని వస్తామన్నారు. ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, ఇండోనేషియా ఫెడరేషన్‌తో కలిసి పని చేస్తామన్నారు. వచ్చే ఏడాది దేశంలో నిర్వహించనున్న అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను సురక్షితంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లు సంయుక్తంగా దర్యఫ్తు చేస్తున్నాయని ఆయన చెప్పారు. విచారణ పూర్తయ్యే వరకు అన్ని రకాల ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణ తాత్కాలికంగా నిలిపివేసినట్లు దేశాధ్యక్షుడు విడోడో ప్రకటించారు. ప్రస్తుతం ప్రతీ స్టేడియానికి సంబంధించిన భద్రత సమీక్ష చేస్తున్నామని.. ఆ తర్వాతే మ్యాచ్‌ల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

First Published:  19 Oct 2022 6:51 AM IST
Next Story