కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా!
లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ట్రూడో ప్రకటన
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని చెప్పారు. ట్రూడో వైదొలగాలంటూ సొంత పార్టీ నేతల నుంచి కొంతకాలంగా డిమాండ్లు వచ్చిన నేపత్యంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్న విషయాన్ని పార్టీకి, గవర్నర్‌కు తెలియజేశాను. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న వెంటనే రాజీనామా చేస్తాను. ఈ ప్రక్రియ కొనసాగించడానికి మార్చి 24 వరకు పార్లమెంటును వాయిదా వేస్తున్నానని జస్టిస్ ట్రూడో ప్రకటించారు.
ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ట్రూడో కేబినెట్‌లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె.. ప్రధాని ట్రోడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. ఇలా సుమారు దశాబ్ద కాలం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిస్ ట్రూడో.. రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేయాల్సిందేనని సొంత పార్టీ ఎంపీలే డిమాండ్ పెరిగింది.