పేలుళ్లు లేవు.. గాయపడినవారు లేరు.. కామ్ గా అల్ జవహరి హతం !
గుట్టుచప్పుడు కాకుండా, ఎలాంటి పేలుళ్ళ శబ్ధాలు లేకుండా అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని చంపేసింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ లో ఓ ఇంట్లో తలదాచుకున్న అతనిపై డ్రోన్ దాడులు చేసి హతమార్చారు.
అమెరికాలాంటి అగ్రరాజ్యాన్నే గడగడలాడించిన అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరి ఖేల్ ఖతమైంది. ఈ పేరు మోసిన టెర్రరిస్టును అమెరికా కామ్ గా మట్టుబెట్టింది. ఇది జోబైడెన్ ప్రభుత్వానికి ఎలా సాధ్యమైంది ? కాబూల్ లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో దాక్కున్న అల్ జవహరి జాడను ఎలా కనిపెట్టింది ? అంటే అమెరికా నిఘా వర్గాలు ఎప్పటినుంచో ఇతడిని తమ డేగ కళ్ళతో చూస్తూ.. ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంటున్నట్టు స్పష్టమవుతోంది. కేవలం రెండంటే రెండు క్షిపణులను జవహరి మీద ప్రయోగించారట. కానీ అక్కడ ఎక్కడా పేలుళ్లు జరగలేదు.. గాయపడినవారు అంతకన్నా లేరు.. ఇమేజీల్లో భయానక లేదా, బీభత్స దృశ్యాలేవీ కనిపించలేదు. ఆరు రేజర్ వంటి బ్లేడ్లతో కూడిన అత్యాధునిక 'హెల్ ఫైర్ ఆర్ 9 ఎక్స్' అనే వార్ హెడ్ లెస్ మిసైల్స్ ని అమెరికా ఈ దాడిలో ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఈ బ్లేడ్లు నేరుగా టార్గెట్ ని ఛేదిస్తాయని, కానీ పేలుడువంటిదేమీ జరగదని, అలాగే దగ్గరున్నవారెవరూ గాయపడరని అమెరికా రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఉగ్రవాద నేతలఫై దాడికి సంబంధించి తమ వ్యూహాలపై అమెరికాలోని రెండు ఏజన్సీలకు మాత్రమే తెలుసునట.. పెంటగన్ గానీ, సిఐఎ గానీ వీటి గురించి ఏనాడూ బహిరంగంగా చెప్పుకోలేదు. 2017 మార్చిలో అల్-ఖైదా సీనియర్ లీడర్ అబూ అల్-ఖయర్ అల్ మాసిర్ సిరియాలో కారులో ప్రయాణిస్తుండగా అతనిపై మొదటిసారి డ్రోన్ ద్వారా ఆర్ 9 ఎక్స్ మిసైల్ ని ప్రయోగించారు. నాటి ఆ ఘటనలో ఆ కారు పైభాగంలో పెద్ద రంధ్రం ఏర్పడడాన్ని, కారు మెటల్ పాడైపోయి.. లోపలఉన్నవారి శరీరాలు ఛిద్రమైన దృశ్యాల తాలూకు ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అంతే తప్ప ఆ వాహనం ముందు, వెనుకల భాగమంతా చెక్కుచెదరకుండా ఉంది. అప్పటివరకు డ్రోన్ల ద్వారా ప్రయోగించే హెల్ ఫైర్ మిసైళ్ళ పవర్ ప్రపంచానికి తెలియదు. నిజానికి ఈ క్షిపణుల పేలుడు కారణంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కరడు గట్టిన ఉగ్రవాది అల్ జవహరిని మట్టుబెట్టేందుకు ఉపయోగించిన మిసైళ్లలోని మిస్టీరియస్ వెపన్ వివరాలు లీకయ్యాయి.
ఈ క్షిపణులను 'ఫ్లయింగ్ జిన్సు' గా అభివర్ణిస్తున్నారు. ఇది నాటి జపాన్ పదజాలం. జపనీయుల ఇళ్లలోని కిచెన్లలో ఉపయోగించే కత్తులివి. 1980 ప్రాంతాల్లో వచ్చిన టీవీ కమర్షియల్ యాడ్స్లో ఇలాంటి పదాన్ని వాడారు. 'నింజా బాంబు' గా కూడా వ్యవహరించే ఈ క్షిపణి కేవలం టార్గెట్ ని మాత్రమే ఛేదించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా నివారిస్తుందని పెంటగన్ వర్గాలు చెబుతున్నాయి. జవహరిపై దాడి విషయంలో ఇదే జరిగింది.
జులై 31 న జవహరి కాబూల్ లోని తన ఇంటి బాల్కనీపై ఒంటరిగా నిలబడినప్పుడు తమ దేశ డ్రోన్ రెండు హెల్ ఫైర్ మిసైళ్లను అతనిపై ప్రయోగించినట్టు అమెరికా అధికారి ఒకరు చెప్పారు. ఈ ఎటాక్ జరిగిన సందర్భంలో ఈ భవన కిటికీలు పేలిపోయి కిందపడిపోయినప్పటికీ భవనంలోని ఇతర కిటికీలు గానీ, వేరు ఫ్లోర్లు గానీ చెక్కుచెదరకుండా ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో జవహరి కుటుంబ సభ్యులు కూడా ఆ ఇంటిలోనే ఉన్నారని, కానీ వారికి ఎలాంటి హానీ జరగలేదని ఆ అధికారి చెప్పారు. ఈ దాడిలో ఇతరులెవరూ గాయపడలేదని తమకు సంకేతాలు అందాయన్నారు.