Telugu Global
International

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌

ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉండటంతో డెమోక్రాట్లలో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు కమలా హ్యారిస్ సరైన వ్యక్తి అని మెజార్టీ డెమోక్రాట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌
X

అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఆమోదించారు. ఈమేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు బైడెన్ లేఖ రాశారు. తన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడం, ట్రంప్‌తో జరిగిన చర్చలో వైఫల్యంతో పాటూ వ్యయస్సు రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్నిక‌ల బ‌రి నుంచి వైదొలగక తప్పని పరిస్థితి తలెత్తిందని, పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్‌గా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్‌.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.

డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ నిష్క్రమించడంతో ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు అనేది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న అంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉండటంతో డెమోక్రాట్లలో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు కమలా హ్యారిస్ సరైన వ్యక్తి అని మెజార్టీ డెమోక్రాట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్, ఇల్లినోయీ గవర్నర్‌ జేబీ ఫ్రిట్జ్‌కెర్‌ బరిలో నిలిచే అవకాశముంది. ఒకవేళ కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ఆ స్థానాన్ని అధిష్టించిన తొలి నల్లజాతీయురాలిగా ఆమె చరిత్రలోకి ఎక్కనున్నారు.

డెమోక్రాటిక్‌ నామినీగా బైడెన్‌ వైదొలిగిన అంశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఒకవేళ కమలా హారిస్‌ అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానన్నారు.

First Published:  22 July 2024 8:05 AM IST
Next Story