13న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ భేటీ
ఓవల్ లో సమావేశం కానున్న ప్రెసిడెంట్, కాబోయే ప్రెసిడెంట్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 13న సమావేశం కానున్నారు. 13న ఉదయం 11 గంటలకు ఓవల్ లో ఈ సమావేశం జరుగుతుందని వైట్ హౌస్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడితో ప్రస్తుత అధ్యక్షుడు సమావేశం అమెరికా సంప్రదాయమని, ఈ సంప్రదాయంలో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ పై విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మొదట డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఉండగా.. వయోభారం, ఇతర కారణాలతో పార్టీ ఆయనను తప్పించి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ను క్యాండిడేట్ గా ప్రకటించింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడి హోదాలో డొనాల్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత సంప్రదాయ బద్ధంగా కాబోయే అధ్యక్షుడితో ట్రంప్ సమావేశం ఏర్పాటు చేయలేదు. కానీ జో బైడెన్ అమెరికా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాబోయే అధ్యక్షుడితో మర్యాదపూర్వక సమావేశం ఏర్పాటు చేశారు.