పాకిస్తాన్ పై ఆ దేశంలోనే విమర్శలు గుప్పించిన జావేద్ అక్తర్
పాకిస్తాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జావేడ్ అక్తర్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి మాట్లాడారు. " మేము ముంబైకి చెందిన వ్యక్తులం, మా నగరంపై దాడికి మేము ప్రత్యక్ష సాక్షులం . దాడి చేసినవారు నార్వే లేదా ఈజిప్ట్ నుండి రాలేదు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి హిందుస్తానీ హృదయంలో కోపం ఉండటం సహజం.'' అన్నారాయన
26/11 దాడికి కారణమైన ఉగ్రవాదులు ఈ దేశంలో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటూ ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ పాకిస్తాన్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు జావేద్ అక్తర్ గత వారం పాకిస్థాన్‌ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జావేడ్ అక్తర్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి మాట్లాడారు.
"మనం ఒకరినొకరు నిందించుకోకూడదు. అది దేనినీ పరిష్కరించదు. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది, దానిని చల్లార్చాలి.మేము ముంబైకి చెందిన వ్యక్తులం, మా నగరంపై దాడికి మేము ప్రత్యక్ష సాక్షులం . దాడి చేసినవారు నార్వే లేదా ఈజిప్ట్ నుండి రాలేదు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి హిందుస్తానీ హృదయంలో కోపం ఉండటం సహజం.'' అన్నారాయన
పాక్ దిగ్గజాలకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్‌లో స్వాగతం లభించలేదని ఆయన ఎత్తిచూపారు.
"ఫైజ్ సాహబ్ భారత్ సందర్శించినప్పుడు, అతన్ని చాలా ముఖ్యమైన సందర్శకుడిలా మేము చూశాము. ఆ కార్యక్రమం దేశమంతా ప్రచారం చేశాం. మేము నుస్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్‌ల పెద్ద ఫంక్షన్‌లను నిర్వహించాము. మీరు (పాకిస్థాన్) లతా మంగేష్కర్ కోసం ఎప్పుడూ ఒక ఫంక్షన్ కూడా ఎందుకు నిర్వహించలేదు?" అని జావేద్ ప్రశ్నించారు.
పాకిస్తాన్ లో జావేద్ అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలను నెటిజనులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఆయన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. కొందరు దీనిని పాకిస్తాన్‌లో జావేద్ "సర్జికల్ స్ట్రైక్" అని వర్ణించారు.
''జావేద్ సాబ్ కవిత్వం విన్నప్పుడు, అతన్ని సరస్వతీ దేవి అంతగా ఎలా ఆశీర్వదించించిందో అని నేను ఆశ్చర్యపోతుంటాను. కానీ దేవుడు వారిని ఆశీర్వదించడానికి ఆ వ్యక్తిలో ఉన్న స్వచ్ఛత ముఖ్యమైనది. జై హింద్ జావేద్ సాబ్. ఘర్ మే ఘుస్ కే మార (మీరు వారిని వారి ఇంట్లోనే ఓడించారు)" అని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.