'బాధ్యతగా తాగండి' యువతకు జపాన్ ప్రభుత్వ విజ్ఞప్తి
దేశ ఆదాయం ముఖ్యమా, జనం ఆరోగ్యం ముఖ్యమా... అంటే ఏ ప్రభుత్వమైనా ఆదాయానికే ఓటేస్తుంది. జపాన్ కూడా అదే బాటలో నడుస్తోంది.
దేశ ఆదాయం ముఖ్యమా, జనం ఆరోగ్యం ముఖ్యమా... అంటే ఏ ప్రభుత్వమైనా ఆదాయానికే ఓటేస్తుంది. జపాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. అక్కడ ఆల్కహాల్ అమ్మకాలను పెంచేందుకు ఆ దేశ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. దేశంలో ఆల్కహాల్ అమ్మకాల ద్వారా వచ్చే పన్నుల ఆదాయం తగ్గుముఖం పడుతుండటంతో మద్యం అమ్మకాలు పెంచాలని చూస్తోంది. మద్యం వినియోగం పెంచే మార్గాలను చెప్పమంటూ యువతను ఆహ్వానిస్తోంది.
సేక్, షోచు, అవమోరి, బీర్ వంటి ఆల్కహాల్ సంబంధిత పానీయాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు వ్యాపార ప్రణాళికలు చెప్పమని జపాన్ నేషనల్ టాక్స్ ఏజన్సీ ప్రజలను కోరింది. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలపట్ల ప్రజల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వమే ఒక అనారోగ్యకరమైన అలవాటుని పెంచాలని తాపత్రయపడుతుండటంతో అది తన నైతిక ధర్మాన్ని తప్పిందనే విమర్శలు వస్తున్నాయి.
దేశంలో లిక్కర్ పరిశ్రమ నుండి వస్తున్న ఆదాయం తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నేషనల్ టాక్స్ ఏజన్సీ వెలువరించిన నివేదిక ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ అమ్మకాలపై పన్నుల ద్వారా వసూలైనది... మొత్తం ఆదాయంలో 1.9శాతంగా ఉంది. 2010 ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆదాయం 3.3 శాతంగా ఉంది. 2000 సంవత్సరంలో ఆల్కహాల్ అమ్మకాలపై విధించిన పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం ... మొత్తం ఆదాయంలో 3.6శాతంగా ఉంది. 1994లో లిక్కర్ టాక్స్ ల ద్వారా 4.1 శాతం ఆదాయం వచ్చింది.
గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఆల్కహాల్ అమ్మకాలు... వాటిద్వారా వస్తున్న పనుల్లో తగ్గుదల స్పష్టంగా కనిపించడంతో జపాన్ ప్రభుత్వం ఆల్కహాల్ అమ్మకాలను పెంచే పనిలో పడింది.
20 నుండి 39 మధ్య వయసున్నవారు మద్యం పరిశ్రమ పునరుజ్జీవం పొందడానికి తగిన వ్యాపార ప్రణాళిలను సమర్పించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. సేక్ వివా అనే పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 9 వరకు ప్రజలు సేక్ వివా పోటీకి తమ ఎంట్రీలను పంపవచ్చు. ఎంపిక చేసినవి నవంబరులో టోక్యోలో జరిగే సేక్ వివా కార్యక్రమంలో భాగం పంచుకుంటాయి.
ప్రభుత్వం ప్రకటించిన ఈ సేక్ వివా పోటీపట్ల, ప్రభుత్వమే అనారోగ్యకరమైన అలవాటు పెంచే ప్రయత్నాలు చేయటం పట్ల జపాన్ లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. అయితే జపాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మాత్రం ప్రజలు 'బాధ్యతతో తాగాలి' అంటోంది.