99 లైంగిక వేధింపులు.. పదవి పోగొట్టుకున్న మేయర్
జపాన్‌లోని సెంట్రల్ గిఫు ప్రాంతంలో ఓ పట్టణానికి చెందిన 74 ఏళ్ల మేయర్ హిడియో కోజిమాపై లైంగిక వేధింపులకు సంబంధించి విపరీతమైన ఆరోపణలు వచ్చాయి.
వ్యక్తులుగా మీరెలా ఉన్నా అది మీ ఇష్టం. కానీ, ప్రజాజీవితంలోకి వచ్చాక మాత్రం ఒళ్లు దగ్గరపెట్టుకునే ఉండాలి. కాదని అడ్డగోలుగా వెళితే పదవి పోతుంది.. జనంలో పరువూ పోతుంది. దీనికి ఉదాహరణే జపాన్‌లోని ఆ మేయర్. ఒకటీ రెండూ కాదు ఏకంగా 99 లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆ మేయర్ రాజీనామాతో ఈ విషయం బయటపడి సోషల్ మీడియాలో దుమారం రేపింది.
74 ఏళ్ల వయసులో ఏంటీ పాడుపనులు?
జపాన్‌లోని సెంట్రల్ గిఫు ప్రాంతంలో ఓ పట్టణానికి చెందిన 74 ఏళ్ల మేయర్ హిడియో కోజిమాపై లైంగిక వేధింపులకు సంబంధించి విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. సహోద్యోగి ప్రైవేట్ పార్ట్స్‌ను కావాలనే తాకారని, కొందరు మహిళా ఉద్యోగులను సిబ్బంది అందరి ముందూ కౌగిలించుకున్నారని అధికారిక దర్యాప్తులో తేలింది. కమిటీ ఆ మున్సిపాల్టీలోని 190 మంది సిబ్బందిని విచారిస్తే అందులో 60 శాతం మంది మహిళా ఉద్యోగులు కోజిమా చర్యలతో తాము ఇబ్బందిపడ్డామని చెప్పారు.
అతను ఏడవాల్సిందే
అయితే తనపై వచ్చిన ఆరోపణలను కోజిమా ఖండించారు. తానేదో వాత్సల్యంతో హత్తుకుంటే కోరికతో కౌగిలించుకున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నానన్నారు. ఈ మాటలంటూ మీడియా సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని కూడా జనం తిట్టిపోశారు. నీవల్ల మహిళా ఉద్యోగులు ఏడ్చారు.. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తావ్ అని కొందరు, నువ్వు చేసిన పనికి ఏడవాల్సిందే అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కోజిమాపై దుమ్మెత్తిపోశారు.