టోక్యోను వదిలి వెళ్లండి.. పౌరులకు జపాన్ ప్రభుత్వం పిలుపు
ఇద్దరు పిల్లలున్న ఓ కుటుంబం టోక్యో నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే 12 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా క్రమక్రమంగా టోక్యో జనాభాను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
జపాన్ దేశ జనాభా 12.5 కోట్లు. జపాన్ రాజధాని టోక్యో జనాభా 1.5 కోట్లు. దేశం మొత్తం జనాభాలో దాదాపు 10శాతం టోక్యోలోనే నివశించడం విశేషం. ఆ మాటకొస్తే అసలు జపాన్ లో పల్లెటూళ్లలో నివశించేందుకు ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. అందరూ పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు. అది కూడా ఓ మోస్తరు పట్టణాలను ఎవరూ ఇష్టపడటం లేదు. జపాన్ లో కేవలం మూడు నగరాలు మాత్రమే జనాభాతో పోటెత్తుతున్నాయి. రాజధాని టోక్యోతోపాటు ఒసాకో, నగోయా నగరాల్లో నివశించే మొత్తం జనాభా 52శాతం. అంటే ఆ దేశంలో సగానికంటే ఎక్కువ జనాభా ఆ మూడు నగరాల్లోనే ఉండిపోయింది. ఈ అసమతుల్యతే అక్కడ ఇబ్బందులకు కారణం అవుతోంది.
టోక్యోకి వలసలు పోటెత్తాయి. అక్కడ చదరపు కిలోమీటరుకి 6158మంది నివశిస్తున్నారు. విపరీతంగా జనాభా పెరిగిపోవడంతో టోక్యో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. మరో వైపు జపాన్ జనాభా మాత్రం తగ్గిపోవడం విచిత్రం. జపాన్ లో గత ఏడాది కాలంలో 6.44 లక్షల జనాభా తగ్గింది. అదే సమయంలో టోక్యోలో గత దశాబ్ద కాలంలో జనాభా 16శాతం పెరిగింది. పెరిగిన జనాభాకు సరిపడా మౌలిక వసతులను స్థానిక ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి. కాలుష్యం పెరిగింది, సరైన వసతులు లేవు, అయినా కూడా జనాభా టోక్యోని వదిలి పెట్టడంలేదు. అందుకే ఇప్పుడు టోక్యోపై జనాభా ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం ఆఫర్లు ప్రకటిస్తోంది.
వెళ్లిపోతే తాయిలాలు..
పిల్లలు ఉన్న కుటుంబాలు టోక్యో నుంచి వెళ్లిపోతే ప్రభుత్వం నజరానా ప్రకటిస్తోంది. ఒక్కో పిల్లవాడికి భారత కరెన్సీలో దాదాపు 6 లక్షల రూపాయలు ఇస్తామంటోంది. అంటే ఇద్దరు పిల్లలున్న ఓ కుటుంబం టోక్యో నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే 12 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా క్రమక్రమంగా టోక్యో జనాభాను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో 2 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించినా పెద్దగా ఫలితం లేదు, అందుకే ఆ పరిహారాన్ని భారీగా పెంచి 6 లక్షల చేసింది ప్రభుత్వం.
వర్క్ ఫ్రమ్ హోమ్ తో మారిన పరిస్థితి..
ప్రస్తుతం ప్రపంచమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటైంది. ఎక్కడున్నా ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వ పరిహారం తీసుకుని చాలామంది టోక్యోని వీడిపోతున్నారని తెలుస్తోంది. 2027నాటికి దాదాపు 10వేల కుటుంబాలు టోక్యో నుంచి మకాం మార్చేస్తాయని అంటున్నారు అక్కడి అధికారులు.