Telugu Global
International

వృద్ధుల జనాభాలో జపాన్ సరికొత్త రికార్డ్

యువత అందుబాటులో లేకపోవడంతో జపాన్ లో వృద్ధులే ఇంకా ఉద్యోగాల్లో నెట్టుకొస్తున్నారు. 10లక్షలమంది జపాన్ వృద్ధులు ఇంకా ఆఫీస్ లకు వెళ్తున్నారు.

వృద్ధుల జనాభాలో జపాన్ సరికొత్త రికార్డ్
X

యువతకు మంచి రోజులు, యువతకు తొలి ప్రాధాన్యం, రాబోయే రోజులన్నీ యువతవే.. అనే మాటలు ఎక్కడైనా వినొచ్చు కానీ, జపాన్ లో మాత్రం కష్టం. ఎందుకంటే అక్కడ గతమే కాదు, భవిష్యత్తు కూడా వృద్ధులదే. అవును జపాన్ ఇప్పుడు వృద్ధుల జనాభాలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అక్కడ ప్రతి 10మందిలో ఒకరు 80ఏళ్లు దాటినవారు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇటీవలే ఈ రికార్డు జపాన్ పరమైంది.

సహజంగా 60ఏళ్లు దాటితే పెన్షన్ ఇచ్చేసి వృద్ధుల జాబితాలో కలిపేస్తారు. కానీ జపాన్ లో 60ఏళ్లు దాటినవారి సంఖ్య చాలా ఎక్కువ. 65 ఏళ్లు దాటినవారు జపాన్ లో 29.1 శాతం ఉన్నారు. ఇటీవలే వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. జపాన్ తర్వాత వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు ఇటలీ, ఫిన్లాండ్. వృద్ధులకోసం జపాన్ లో ప్రతి ఏటా 'రెస్పెక్ట్ ఫర్ ఏజ్డ్ డే' నిర్వహిస్తారు. వృద్ధులు సంబరాల్లో మునిగిపోతారు.

పనిమంతులు కూడా వాళ్లే..

జపాన్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు, ఇతర పథకాలేవీ అమలు చేయకపోవడంతో పెళ్లిళ్లు, పిల్లలు అనే వ్యవహారాలు బాగా తగ్గిపోయాయి. ఉద్యోగాల్లో స్థిరత్వం లేక, ఆర్థిక ఇబ్బందులతో యువత పెళ్లిళ్లవైపు మొగ్గు చూపడంలేదు. దీంతో జననాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆ ప్రభావం పెరిగి పెద్దదై ఇప్పుడు యువత సంఖ్య తక్కువగా కనపడుతోంది. వృద్ధుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. వృద్ధులకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో జీవన ప్రమాణాలు పెరిగి.. వృద్ధుల జనాభాలో క్షీణత నిలిచిపోయింది. యువత అందుబాటులో లేకపోవడంతో జపాన్ లో వృద్ధులే ఇంకా ఉద్యోగాల్లో నెట్టుకొస్తున్నారు. 10లక్షలమంది జపాన్ వృద్ధులు ఇంకా ఆఫీస్ లకు వెళ్తున్నారు. జపాన్ లో ప్రతి ఏడుగురు ఉద్యోగుల్లో ఒకరు వృద్ధులే ఉంటున్నారు. ఈ వృద్ధ జనాభా ఇప్పుడు జపాన్ ని భయపెడుతోంది.

First Published:  19 Sept 2023 6:49 AM IST
Next Story