Telugu Global
International

ఇది అమెరికన్లు గర్వించే విజయం

విజయాన్ని అందించిన అమెరికన్లకు ట్రంప్‌ ధన్యవాదాలు.. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతున్నందన్న డొనాల్డ్‌ ట్రంప్‌

ఇది అమెరికన్లు గర్వించే విజయం
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మ్యాజిక్‌ ఫిగర్‌ (270) కు చేరువలో డొనాల్డ్‌ ట్రంప్‌ (267) ఉన్నారు. 538 ఎలక్ట్రోరల్‌ ఓట్లలో కమలా హారిస్‌కు 214 గెలుచుకోగా.. కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఆధిక్యంలో ఉన్నారు. కీలక స్వింగ్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆధిక్యం సాధించారు.

ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదన్నారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతున్నది. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు బాగా పోరాడారన్నారు. రిపబ్లికన్‌ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పాపులర్‌ ఓట్లలోనూ రిపబ్లికన్‌ పార్టీదే హావా అని తెలిపారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన అమెరికన్లకు ట్రంప్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇది అమెరికన్లు గర్వించే విజయం అన్నారు. అమెరికా కోలుకోవడానికి ఈ విజయం దోహదపడుతుందన్నారు. ఇకపై ప్రతిక్షణం మీ కోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తాను. మనల్ని విమర్శించేవారిని వారి విమర్శలు తప్పని నిరూపించారు. ఎవరూ సాధ్యం కాదనుకున్న అడ్డంకులను అధిగమించాం. ఈ విజయానికి తోడ్పాటు అందించి, కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రతిఫలం ఉంటుంది. యుద్ధాలను ఆపి, అమెరికాను గ్రేటెస్ట్‌గా మార్చడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాను. రాబోయే రోజుల్లో సరిహద్దుల సమస్యలను పరిష్కరించనున్నాం. ప్రజలు చట్టబద్ధంగా దేశంలోకి రావాలి అన్నారు. ఆయన సతీమణి మెలానియాకు కృతజ్ఞతలు చెప్పారు. ఆమె రాసిన పుస్తకం ప్రజాదరణ పొందిందన్నారు.

అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ గొప్ప ఎంపిక అని ప్రశంసించారు. కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్‌, ఆయన సతీమణి ఉషావాన్స్‌కు అభినందనలు తెలిపారు. తన సహాయకులు అందించిన సేవలను ట్రంప్‌ కొనియాడారు. అలాగే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌తో ఉన్న అనుబంధం గురించి ఈ సందర్బంగా ట్రంప్‌ ప్రస్తావించారు. ప్రజలు ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకుని పోయినప్పుడు వారిని రక్షించే చర్యల్లో భాగంగా మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌ ఎంతో ఉపయోగపడిందన్నారు. ట్రంప్‌ విజయాన్ని కొనియాడుతూ.. ఇది అమెరికా చరిత్రలో అతి పెద్ద రాజకీయ పునరాగమనంగా వాన్స్‌ అభివర్ణించారు.

First Published:  6 Nov 2024 1:15 PM IST
Next Story