Telugu Global
International

ఇరాన్‌ అణుస్థావరాలపై దాడి చేస్తామన్న ఇజ్రాయెల్‌

బెంజిమన్‌ నెతన్యాహు చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

ఇరాన్‌ అణుస్థావరాలపై దాడి చేస్తామన్న ఇజ్రాయెల్‌
X

ఇరాన్‌ చేసిన బాలిస్టిక్‌ క్షిపణుల దాడులకు ప్రతీకారంగా ఏస్థాయిలో స్పందించాలనే అంశంపై ఇజ్రాయెల్‌-అమెరికా మధ్య తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్‌ అణుస్థావరాలపై దాడి చేస్తామంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తిరస్కరించారు. దానికి తమ మద్దతు ఉండదని ప్రకటించారు. పరిమితస్థాయిలోనే దాడి చేయాలని బైడెన్‌ కండీషన్లు పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని తెలుస్తోంది. మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని బీరుట్‌ పై ఇజ్రాయెల్‌ రక్షణ దళం ఐడీఎఫ్‌ చేసిన వైమానిక దాడిలో ఓ అపార్ట్‌మెంట్‌ ధ్వంసమైంది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. హెజ్‌బొల్లా మీడియా భవనంపైనా ఐడీఎఫ్‌ దాడి చేసింది. గత 24 గంటల్లో లెబనాన్‌లో 28 మంది వైద్య సిబ్బంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్‌పైకి హెజ్‌బొల్లా కూడా ఆధునిక క్షిపణులను ప్రయోగించింది.

మధ్య ప్రాచ్యంలో యుద్ధాన్ని నివారించగలం: బైడెన్‌

ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా, ఇరాన్‌ పరస్పర దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పందించారు. యుద్ధం జరుగుతుందని తాను నమ్మడం లేదన్నారు. దానిని నివారించగలమని వ్యాఖ్యానించారు. దీనికోసం చేయాల్సింది ఇంకా చాలా ఉన్నదని చెప్పారు.

ఇజ్రాయెల్‌ ప్రకటనపై స్పందించిన ఐరాస భద్రతా మండలి

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ తమ దేశంలోకి రావొద్దని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి చెప్పారు. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్పందించింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యూఎన్‌ సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితితో సంబంధం లేదనే నిర్ణయం ఏదైనా ప్రతికూలతకు దారితీస్తుందని ప్రకటించారు. ఇజ్రాయెల్‌ పేరు ప్రస్తావించకుండానే ఆ ప్రకటన వెలువడింది.

తటస్థంగా అరబ్‌ దేశాలు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే అరబ్‌ దేశాలు ఎవరిపక్షం వహించకుండా తటస్థంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇటీవల దోహాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు వారు అభిప్రాయాన్నితెలిపినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

గల్ఫ్‌ చమురు కేంద్రాలపై దాడి చేస్తామని ఇరాన్‌ నుంచి ఎటువంటి బెదిరింపులు లేవు. అయితే ఇజ్రాయెల్ కు మద్దుతుగా నేరుగా జోక్యం చేసుకుంటే వారి ప్రయోజాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ హెచ్చరించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే గల్ఫ్‌ చమురు కేంద్రాలపై ఇరాన్‌ ఎటువంటి దాడులు చేయదని తాము భావిస్తున్నట్లు సౌదీకి చెందిన ఓ వ్యాఖ్యాత పేర్కొన్నారు. యూఏఈ, బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, ఖతర్‌, కువైట్‌లు కలిగి ఉన్న గల్ఫ్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని ఇరాన్‌ను కోరింది.

First Published:  4 Oct 2024 6:58 AM GMT
Next Story