Telugu Global
International

గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

బబాలియా క్యాంప్‌పై చేసి చేసిన దాడిలో మృతి చెందిన 21 మంది మహిళలు.. 85 మందికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య 50కి చేరే అవకాశం

గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌
X

గాజాపై ఇజ్రాయెల్‌ మరోసారి విరుచుకుపడింది. హమాస్‌ అగ్రనేత సిన్వర్‌ హతమైన తర్వాత ఈ దాడులను మరింత ఉధృతం చేసింది. తాజాగా ఉత్తర గాజాలో చేసిన వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారని అక్కడి వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో బీభత్సం సృష్టించింది. మృతుల్లో 21 మంది మహిళలే కావడం గమనార్హం. ఈ దాడుల్లో దాదాపు 85 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అనేకమంది శిథిలాల కింద చిక్కుకునిపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా ఇప్పటివరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది.

ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులకు యత్నించిన సిరియా

మరోవైపు ఇజ్రాయెల్‌పై సిరియా వైమానిక దాడులకు ప్రయత్నించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. అది తమ భూభాగంలోకి ప్రవేశించకముందే దాన్ని కూల్చినట్లు పేర్కొన్నది. ఇరాన్‌ మద్దతుతోనే సిరియా ఈ డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది.

సిన్వర్‌ చనిపోవడంచాలా బాధగా అనిపించింది

ఒంటరిగా ఉండి హమాస్‌ అగ్రనేత యాహ్యా సిన్వర్‌ మృతదేహాన్ని చూస్తుంటే అవన్నీ గుర్తుకువచ్చాయని .. అతని మృతదేహంతో ఒంటరిగా గడిపిన క్షణాలను ఇజ్రాయెల్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఇటమార్‌ ఈతం సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. ఈ వ్యక్తి చాలా బాధ కలిగించాడు. శిథిలమైన ఆ నగరాన్ని ఒక్కసారి చూశాను. అతను చనిపోవడం కూడా చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అతను కూడా ఒకప్పుడు ఏమీ తెలియని పిల్లవాడు. పెద్దవాడిగా మారే క్రమంలో దుష్టమార్గాన్ని ఎంచుకున్నాడని పోస్టు పెట్టాడు.

బుల్లెట్‌ గాయంతోనే సిన్వర్‌ మృతి

సిన్వర్‌ పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి . బుల్లెట్‌ గాయంతోనే అతను మృతి చెందాడు. తలపై బుల్లెట్‌ గాయం ఉందని, దాని కారణంగా అతను మరణించి ఉండాని వైద్యుడు పేర్కొన్నాడు. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా కాల్పుల విరమణ ఒప్పందమే ఈజీ: బైడెన్‌

హమాస్‌ కంటే.. ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా కాల్పుల విరమణ ఒప్పందమే ఈజీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించడానికి జో బైడెటన్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ చర్చలు జరిపారు. చర్చల అనంతరం బైడెన్‌ పై విధంగా వ్యాఖ్యానించారు.

First Published:  19 Oct 2024 9:06 AM IST
Next Story