ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కుదిరిన సయోధ్య
బందీలను విడుదల చేయడానికి ఇరువర్గాల మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకున్నదని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడి
అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య సయోధ్య కుదిరింది. బందీలను విడుదల చేయడానికి ఇరువర్గాల మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకున్నదని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి.కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలిగించినట్లు పేర్కొన్నది.
అలాగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని ఆమోదించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సమావేశమౌతుంది. క్యాబినెట్ ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే.. ఆదివారం నుంచి ఇది అమలుకావొచ్చని సమాచారం. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనున్నది. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించడానికి నిబంధనలు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒప్పందం విషయమై ఇప్పటికే బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా, 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. హమాస్ అగ్రనేత ఇస్మాయెల్ హనియా, అక్టోబర్ 7 నాటి ఘటనకు సూత్రధారి యహ్వా సిన్వార్‌తో పాటు కీలక నేతలను హతమార్చింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46,00 మందికిపైగానే పాలస్తీనీయులు మృతి చెందారు.