Telugu Global
International

సెంట్రల్‌ బీరుట్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో 22 మంది మృతి .. 117మంది గాయపడ్డానని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

సెంట్రల్‌ బీరుట్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌
X

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంటున్నది. తాజాగా ఇజ్రాయెల్‌ లెబనాన్‌లోని బీరుట్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. హెజ్‌బొల్లాకు చెందిన ఓ ముఖ్యనేతను హతమార్చడమే లక్ష్యంగా ఐడీఎఫ్‌ ముందుకు సాగుతున్నది. దాడి నుంచి అతను తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందారు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా.. 117మంది గాయపడ్డారు అని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది ఇలా ఉండగా.. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. యూఎన్‌ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ఖండించారు. దీన్ని యుద్ధనేరంగా పరిగణిస్తామని చెప్పారు. ఈ దాడులపై వాషింగ్టన్‌ కూడా స్పందించింది. హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేసే సమయంలో యూఎన్‌ శాంతి పరిరక్షకుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండటం కష్టమని పేర్కొన్నది. అలాగే ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో యూఎన్‌ పరిరక్షఖులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని యూఎన్‌ సూచించింది.

ఇస్లామిక్‌ జిహాద్‌ టాప్‌ కమాండర్‌ హతం

వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయల్‌ దాడి చేసింది. ఈ దాడిలో ఇస్లామిక్‌ జిహాద్‌ టాప్‌ కమాండర్‌ హతమయ్యాడు. ఇస్లామిక్‌ జిహాద్‌ హమాస్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతున్నది. నూర్‌ షామ్స్‌ శరణార్థుల శిబిరంపై తాము చేసిన దాడిలో మహమ్మద్‌ అబ్దుల్లా చనిపోయాడని ఇజ్రాయెల్‌ మిలటరీ వెల్లడించింది. ఆగస్టులో మహమ్మద్‌ జబ్బార్‌ చనిపోయిన తర్వాత అబ్దుల్లా బాధ్యతలు చేపట్టాడని తెలిపింది.

First Published:  11 Oct 2024 9:48 AM IST
Next Story