ఫుట్‌బాల్ ప్లేయర్‌కు ఇరాన్‌లో మరణశిక్ష.. కారణం ఏంటో తెలుసా?
అమీర్ నసర్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. సేపహన్ క్లబ్‌కు ఆడటం ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు.
యువ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ మరణ శిక్ష విధించింది. ఇంతకు అతడు చేసిన నేరం ఏంటంటే.. ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనడమే. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న 26 ఏళ్ల అమీర్ నసర్ అజదానికి అక్కడి ప్రభుత్వం ఏకంగా మరణశిక్ష వేసింది. ఇందుకోసం అతడు చేయని హత్యలను అతడిపై అభియోగంగా మోపింది.
ఇరాన్ మహిళా పోలీసులు కస్టడీలో సెప్టెంబర్ నెలలో 22 ఏళ్ల మహ్సా అమీనీ అనే యువతి మృతి చెందింది. హిజాబ్ సరిగా ధరించలేదు అన్న కారణంతో అమీనీని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోనే ఆమె మృతి చెందడంతో ఇరాన్‌లో నిరసనలు చెలరేగాయి. మహిళల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ వంటి అంశాలతో మొదలైన ఆందోళనలు దేశమంతటా పాకాయి. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ మహిళలకు ఎంతో మంది మద్దతు పలికారు.
ఇరాన్‌లో మొదలైన ఆందోళన పలు చోట్ల ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ క్రమంలో నవంబర్ 17న ఆందోళన సందర్భంగా ఇద్దరు సైనికులు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు. వీళ్ల ముగ్గురి మరణానికి ఆందోళనల్లో పాల్గొన్న ఫుట్‌బాలర్ అమీర్ నసర్ అజదానినే కారణమని ప్రభుత్వం అభియోగాలు మోపి అరెస్టు చేసింది. నవంబర్ 20న టీవీలో కనిపించిన అమీర్.. ఆ హత్యలకు కారణం తానే అని ఒప్పుకున్నాడు. అయితే, ప్రభుత్వమే బలవంతంగా అతడితో ఒప్పించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇరాన్‌లోని ఓ వర్గం మీడియా అమీర్‌కు మద్దతుగా నిలిచింది. అతడు ఆందోళనల్లో కొద్ది సేపు మాత్రమే పాల్గొన్నాడని. ఆ ముగ్గురి మరణాలు సంభవించిన సమయంలో అమీర్ అసలు అక్కడ లేనే లేడని చెప్పింది. అయినా సరే ప్రభుత్వం మాత్రం అతడికి మరణశిక్షను ఖరారు చేసింది.
అమీర్ నసర్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. సేపహన్ క్లబ్‌కు ఆడటం ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు. 2015లో రహ్-అహాన్‌కు ఆడాడు. ఆ తర్వాత ట్రాక్టర్, గోల్డ్-ఈ-రాయ్హన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే గాయం కారణంగా కొంత కాలంగా ఫుట్‌బాల్‌కు దూరంగా ఉంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్లేయర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిఫ్‌ప్రో అనే సంస్థ అమీర్‌కు విధించిన మరణ శిక్షను తీవ్రంగా ఖండించింది. ఈ సంస్థలో 65 వేల మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు సభ్యులుగా ఉన్నారు. మహిళల హక్కుల కోసం జరిగిన నిరసనల్లో పాల్గొన్న అమీర్‌కు మరణ శిక్ష విధించడం దారుణమని ఫిఫ్‌ప్రో పేర్కొన్నది. అతడి మరణశిక్ష రద్దయ్యే వరకు పోరాడతామని ట్వీట్ చేసింది.
FIFPRO is shocked and sickened by reports that professional footballer Amir Nasr-Azadani faces execution in Iran after campaigning for women's rights and basic freedom in his country.
— FIFPRO (@FIFPRO) December 12, 2022
We stand in solidarity with Amir and call for the immediate removal of his punishment. pic.twitter.com/vPuylCS2ph