ఆఫీస్ కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు -ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ మాత్రం కాస్త కరాఖండిగా చెప్పేసింది. వారానికి 5రోజులు ఆఫీస్ కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు, ఆఫీస్ లకు రండి అంటూ దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఆదేశాలిచ్చాయి. అయితే ముందుగా హైబ్రిడ్ మోడ్ ని అలవాటు చేస్తున్నాయి. వారానికి 3రోజులు ఆఫీస్ లకు రండి చాలు అంటున్నాయి, ఇందులో యాజమాన్యాలేవీ కఠినంగా లేవు. బతిమిలాడుకునే ధోరణిలోనే ఉన్నాయి. కానీ ఇన్ఫోసిస్ మాత్రం కాస్త కరాఖండిగా చెప్పేసింది. వారానికి 5రోజులు ఆఫీస్ కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇండియాలో కాదు..
అమెరికా, కెనడాలోని ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆదేశించింది ఇన్ఫోసిస్ సంస్థ. కుదరదు అంటే కచ్చితంగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలియజేసింది. వారానికి ఐదు రోజలు కచ్చితంగా ఆఫీస్ నుంచి పనిచేయాలని ఆదేశించింది. కొత్త వర్క్ పాలసీని పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇన్ఫోసిస్ కు యూఎస్, కెనడాల్లో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారంతా ఇకపై వారానికి 5రోజులు ఆఫీస్ లకు రావాల్సిందే. ప్రస్తుతానికి ఇండియాలోని ఉద్యోగులకు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ని కొనసాగిస్తోంది ఇన్ఫోసిస్.
మూడు దశలు..
ఇటీవల పలు కంపెనీలు ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీస్ లకు రప్పించేందుకు మూడు దశలు ఫాలో అవుతున్నాయి. మొదటి దశలో ఉద్యోగుల సౌలభ్యం కోసం వారానికి రెండు రోజలు, రెండో దశలో దగ్గరలోని బ్రాంచ్ లకు వెళ్లే అవకాశం, మూడో దశలో హైబ్రిడ్ మోడ్ లో మూడు రోజులు.. ఫైనల్ గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ అనే ఆప్షన్ ఇచ్చాయి. ఇన్ఫోసిస్ కూడా ఈ మూడు ఆప్షన్లు ఉద్యోగులకు ఇచ్చింది. అమెరికా, కెనడాలో మాత్రం ఛాయిస్ లేకుండా కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆఫీస్ లకు రాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.