వివాహేతర సంబంధాలపై ఇండోనేషియా కొత్త చట్టం
సవరించిన చట్టం ప్రకారం.. వివాహేతర సంబంధం నెరిపితే ఏడాది జైలు శిక్ష, సహజీవనానికి ఆరు నెలలు శిక్ష విధిస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తారు.
వివాహేతర సంబంధాలపై ఇండోనేషియా కొత్త చట్టం చేసింది. సహజీవనం, వివాహేతర సంబంధాలు ఇకపై నేరంగా పరిగణిస్తూ వాటికి శిక్షలు ఖరారు చేసింది. ఈ మేరకు రూపొందించిన బిల్లును ఆ దేశ పార్లమెంటు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. నవంబరులో తుది రూపునిచ్చిన వివాదాస్పద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లును తాజాగా అమలులోకి తెచ్చింది.
సవరించిన చట్టం ప్రకారం.. వివాహేతర సంబంధం నెరిపితే ఏడాది జైలు శిక్ష, సహజీవనానికి ఆరు నెలలు శిక్ష విధిస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తారు. పర్యాటకంలో భాగంగా ఇండోనేషియాకు వచ్చే విదేశీయులకూ ఇదే చట్టం వర్తిస్తుంది.
అబార్షన్.. దైవ దూషణలు.. ఇకపై నేరం
అబార్షన్, దైవ దూషణలు ఇకపై అక్కడ నేరాలే. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని అక్కడ నిషేధించారు. తనపై విమర్శలకు సంబంధించి నేరుగా దేశాధ్యక్షుడే ఫిర్యాదు చేస్తే నిందితులపై మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కమ్యూనిజాన్ని వ్యాప్తి చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ చట్టాలపై అక్కడి మానవ హక్కుల కార్యకర్తలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసేలా కొన్ని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు