Telugu Global
International

షార్జా-హైదరాబాద్ ఇండిగో విమానం కరాచీలో అత్యవసర లాండింగ్

షార్జా-హైదరాబాద్ ఇండిగో విమానం ఆదివారం ఉదయం అత్యవసరంగా పాకిస్తాన్ లోని కరాచీలో ల్యాండ్ అయింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ కనుగొనడంతో విమానాన్ని కరాచీకి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

షార్జా-హైదరాబాద్ ఇండిగో విమానం కరాచీలో అత్యవసర లాండింగ్
X

షార్జా-హైదరాబాద్ ఇండిగో విమానం ఆదివారం ఉదయం అత్యవసరంగా పాకిస్తాన్ లోని కరాచీలో ల్యాండ్ అయింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ కనుగొనడంతో విమానాన్ని కరాచీకి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ లోపాన్ని అక్కడ విమానాశ్రయ సిబ్బంది చెక్ చేస్తున్నారని, మరో విమానాన్ని అక్కడికి పంపే యోచనలో ఉన్నామని వారు చెప్పారు.

''షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న 6 e-1406 విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ కనుగొన్నారు. రెండు సార్లు హెచ్చరిక రావడంతో ఆయన ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది'' అని ఇండిగో ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు వారాల్లో కరాచీలో అత్యవసరంగా దిగిన రెండో విమానమిది. తాజా ఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది.

షార్జా నుంచి ఇది శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల 2 నిముషాల ప్రాంతంలో బయల్దేరిందని, 4 గంటల ప్రయాణం తరువాత ఇంజన్ లో లోపానికి సంబంధించిన హెచ్చరిక రావడంతో కరాచీకి మళ్లించారని తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున రెండుంబావుకు ఈ విమానం కరాచీ విమానాశ్రయానికి చేరుకున్నట్టు సమాచారం.

కాగా ఢిల్లీ నుంచి దుబాయ్ కి దాదాపు 160 మంది ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్ జెట్ బోయింగ్ విమానం ఈ నెల 5 న అత్యవసరంగా కరాచీలో ల్యాండ్ అయింది. ఇంధనం లీక్ అయిందన్న అనుమానంతో దీన్ని నాడు కరాచీకి మళ్లించారు. జులై 5 న బ్యాంకాక్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న విస్తారా ఎయిర్ బస్ సురక్షితంగా దిగినప్పటికీ ఇంజన్ లో లోపం కారణంగా విమానాన్ని పార్కింగ్ బేలోనే నిలిపివేశారు. ఇండియాలోనూ, మధ్య ప్రాచ్య దేశాల్లోనూ వాతావరణంలో హెచ్చు తగ్గుల దృష్ట్యా ఇలా ఇంజన్లలో లోపాలు తలెత్తుతుంటాయని వీటి ఉత్పత్తిదారులు చెబుతున్నారు.

First Published:  17 July 2022 6:32 AM GMT
Next Story