Telugu Global
International

శ్రీలంకను భయపెడుతున్న ఇండియన్ మెడిసిన్స్.. వాడొద్దని హెల్త్ మినిస్ట్రీ ఆదేశాలు

జూన్ 16న కాండీ జిల్లాలోని పెరడేనియా టీచింగ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఒక పేషెంట్ మరణించాడు. ఇండియాలో తయారు అయిన బుపివాకైన్ అనే అనెస్థీషియాను వాడటం వల్లే ఆ మరణం సంభవించినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసింది.

శ్రీలంకను భయపెడుతున్న ఇండియన్ మెడిసిన్స్.. వాడొద్దని హెల్త్ మినిస్ట్రీ ఆదేశాలు
X

ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న మెడిసిన్స్ ఇప్పుడు శ్రీలంకను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇండియన్ మేడ్ డ్రగ్స్ వాడిన పలువురు రోగులకు సమస్యలు ఎదురు కావడమే కాకుండా.. మరణాలు కూడా సంభవించాయి. జూన్ 16న కాండీ జిల్లాలోని పెరడేనియా టీచింగ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఒక పేషెంట్ మరణించాడు. ఇండియాలో తయారు అయిన బుపివాకైన్ అనే అనెస్థీషియాను వాడటం వల్లే ఆ మరణం సంభవించినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసింది.

అదే ఆసుపత్రిలో రెండు నెలల క్రితం ఒక గర్భిణి కూడా ఇండియాలో తయారు అయిన అసెస్థీషియాను ఉపయోగించడంతో మరణించింది. దీంతో వెంటనే సదరు డ్రగ్‌ వాడకాన్ని నిలిపివేయాలని శ్రీలంక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనలు జరగక ముందే ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ శ్రీలంక అనే సంస్థ శ్రీలంక సుప్రీంకోర్టులో ప్రాథమిక హక్కుల పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక కేబినెట్, ఆరోగ్య శాఖ వర్గాలు నమోదు చేయబడని సరఫరాదారుల వద్ద నుంచి డ్రగ్స్ తీసుకుంటుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇండియా నుంచి మెడిసిన్స్ సరఫరా కోసం రిజిస్ట్రేషన్‌ను ఎత్తివేయడంలో శ్రీలంక జాతీయ డ్రగ్ రెగ్యులేటర్ పాత్రను కూడా ఆ పిటిషనర్ ప్రశ్నించారు. గుజరాత్‌కు చెందిన సావొరైట్ ఫార్మాస్యూటికల్స్, చెన్నైకి చెందిన కౌశిక్ థెరపుటిక్స్‌ను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ రెండు కంపెనీల నుంచి డ్రగ్స్ దిగుమనతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది మేలో కూడా ఇండియన్ డ్రగ్స్ వార్తల్లో నిలిచాయి. శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్‌లోని నువారియా ఏలియా జనరల్ హాస్పిటల్‌లో 10 మంది పేషెంట్లు కంటి చూపును కోల్పోయినట్లు పేర్కొన్నారు. కంటి సర్జరీల అనంతరం ఇండియాలో తయారు అయిన మెడిసిన్ వాడటం వల్లే ఇలా జరిగిందని కూడా తేల్చారు. సదరు డ్రగ్‌లో సూక్ష్మక్రీములు ఉన్నట్లు ఒక డాక్టర్ కూడా చెప్పారు. దీంతో ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించడమే కాకుండా సదరు డ్రగ్ వాడకాన్ని నిలిపేసింది.

వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో ఇండియన్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్న డ్రగ్స్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇది జాతీయ ఆరోగ్య విపత్తు కిందకు వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఇండియాలో తయారైన దగ్గు మందు వాడటం వల్ల గాంబియా, ఉజ్‌బెకిస్తాన్‌లో కూడా పలువురు రోగులు అస్వస్థతకు గురైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

చాలా ఏళ్లుగా శ్రీలంక తమ మెడిసిన్స్, డ్రగ్స్ అవసరాల కోసం ఇండియా పైనే ఆధారపడుతోంది. 2022లో దాదాపు 450 మిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను శ్రీలంక దిగుమతి చేసుకున్నది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం సమయంలో భారత్ విలువైన మందులను సరఫరా చేసింది. ఆ సమయంలో మందుల కొనుగోలుకు కూడా శ్రీలంక ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో.. భారత ప్రభుత్వమే 4 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ఇచ్చి.. అవసరమైన ఔషధాలను సరఫరా చేసింది.

అయితే, ఇటీవల భారత మెడిసిన్స్ వాడిన తర్వాత మరణాలు సంభవిస్తుండటంతో.. దానిపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శ్రీలంక జాతీయ డ్రగ్ రెగ్యులేటర్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శ్రీలంక ఆరోగ్య మంత్రి కెహెలియా రంబుక్‌వెల్లా స్పందిస్తూ.. సంబంధిత అధికారులు డ్రగ్స్‌ను పరీక్షిస్తున్నారని.. త్వరలోనే సమగ్ర నివేదిక అందుతుందని చెప్పారు. గత ఏడేళ్లుగా శ్రీలంక కంటి సంబంధిత ఔషధాలను అదే సరఫరాదారుని నుంచి దిగుమతి చేసుకుంటోంది.

గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని కూడా శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. ఒక్కోసారి ఒక బ్యాచ్ మెడిసిన్‌ క్వాలిటీ లేకుండా ఉండొచ్చు. రవాణా సమయంలో, స్టోరేజ్ చేసినప్పుడు సమస్య ఉత్పన్నం అయ్యుండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఒక్కోసారి పేషెంట్‌కు ఏదైనా అలర్జీ సమస్య ఉన్నప్పుడు.. మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావొచ్చని అంటున్నారు. కారణాలు ఏవైనా ప్రస్తుతానికి అయితే డ్రగ్ వాడకాన్ని నిలిపేశామని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ సరఫరాదారుడిదే తప్పని తేలితే.. నష్టపరిహారం కోరతామని అంటున్నారు.

శ్రీలంకలో ఒక వైపు మందుల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అదే సమయంలో భారత ఔషధాల వల్ల ఇలాంటి సంఘటనలు సంభవిస్తుండటం హెల్త్ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని శ్రీలంక మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ అరియరత్నే చెప్పారు. డ్రగ్స్ క్వాలిటీ లేకపోవడం అనేది చాలా తీవ్రమైన సమస్య. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భారత ప్రభుత్వం ఇచ్చిన క్రెడిట్ లైన్ ఉపయోగించి సదరు మెడిసిన్స్‌ను శ్రీలంక దిగుమతి చేసుకుంటోంది. ఆ ఔషధాలు అన్నీ శ్రీలంకలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. అక్కడకు ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే వస్తారు. ఇప్పుడు వాళ్లు కూడా భయంతో ప్రైవేటు ఫార్మసీల నుంచి అధిక ధరలకు ఔషధాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

శ్రీలంకలోని ఫార్మసీలలో అమ్మే మెడిసిన్స్‌కు సంబంధించి ఎలాంటి ధరల కట్టడి అమలు కావడం లేదు. మామూలు ఔషధాలను కూడా భారీ ధరలకు అమ్ముతుంటారు. డయాబెటిస్ మెడిసిన్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేద కుటుంబాలు ఆయా ఔషధాలను కొనలేకపోతున్నారు.

శ్రీలంకలో రెగ్యులేటరీ వ్యవస్థ చాలా బలహీనంగా ఉండటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నేషనల్ మెడికల్ రెగ్యులేటరీ అథారిటీ పూర్తి అచేతనంగా ఉన్నది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను ఎత్తివేయడంతో పలు ఫార్మస్యూటికల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా శ్రీలంకకు మందులు సరఫరా చేస్తున్నట్లు డాక్టర్ అరియరత్నే స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ సమస్య తీవ్రతను తెలియజేశాము. ఆరు నెలల లోపు నాణ్యమైన డ్రగ్స్ సరఫరా చేయకపోతే దేశంలో ఆరోగ్య విపత్తు వస్తుందని ఆయన తెలిపారు.

First Published:  19 Jun 2023 7:37 AM IST
Next Story