Telugu Global
International

ట్విట్టర్ కీలక పోస్టులో మోడీ ఏజెంట్, వినియోగదారుల సమాచారం తస్కరణ‌.. బైటపెట్టిన మాజీ భద్రతా చీఫ్

మోడీ సర్కార్ ట్విట్టర్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అందులో తన ఏజెంట్ ను నియమించుకుందని ఆ సంస్థ మాజీ సెక్యూరిటీ ఛీఫ్ బైటపెట్టారు. అతని ద్వారా ట్విట్టర్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసే వినియోగదారుల డేటాను మోడీ సర్కార్ సంపాదించిందని ఆయన ఆరోపించారు.

ట్విట్టర్ కీలక పోస్టులో మోడీ ఏజెంట్, వినియోగదారుల సమాచారం తస్కరణ‌.. బైటపెట్టిన మాజీ భద్రతా చీఫ్
X


మోడీ ప్రభుత్వం గురించి మరో విషయం బైటపెట్టింది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక. ఆ పత్రిక ఓ సంచలన ఇంటర్వ్యూ ప్రచురించింది. ట్విట్టర్ లో తమ ఏజెంట్ ను ప్రవేశపెట్టడానికి మోడీ ప్రభుత్వం ఏంచేశారో చెప్పిన ట్విట్టర్ మాజీ భద్రతా ఛీఫ్ 'జట్కో' తో ఇంటర్వ్యూ చేసింది వాషింగ్ టన్ పోస్ట్.

కొన్ని సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం నుండి వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్ల‌ ట్విట్టర్ మోడీ ఏజెంట్‌ను కీలకమైన బాధ్యతల్లో నియమించిందని జట్కో చెప్పారు.


ఈ విషయంపై జట్కో విజిల్‌బ్లోయర్ FTCలో ఓ పిర్యాదు కూడా దాఖలు చేశారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

"భారత దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో వినియోగదారుల‌ డేటా ను సంపాదించడం కోసం భారత ప్రభుత్వం తన ఏజెంట్లలో ఒకరిని పేరోల్‌లో ఉంచమని ట్విట్టర్ పై తీవ్ర వత్తిడి తీసుక‌వచ్చిందని జాట్కో ఫిర్యాదు పేర్కొంది." అంటూ వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఆ ఏజెంట్ వినియోగ దారుల డేటాను మోడీ ప్రభుత్వానికి అందించారని జట్కో తెలిపినట్టు వాషింగ్ట‌న్ పోస్ట్ తెలిపింది.

జట్కో చెప్పిన విషయాలతొ మరో ట్విట్టర్ ఉద్యోగి కూడా ఏకీభవించారని, "డేటా సేకరించిన ఆ ఉద్యోగి ఏజెంట్ అయి ఉండవచ్చు" అని అంగీకరించారని నివేదిక పేర్కొంది.

భద్రతాపరమైన సమస్య‌ల కారణంగా అనేక మంది ప్రముఖు ట్విట్టర్ వినియోగదారులు తమ ఖాతాలని వదిలేసుకుంటున్న సమయంలో ప్రసిద్ధ మోరల్ హ్యాకర్ అయిన జాట్కోను 2020లో ట్విట్టర్ మాజీ CEO జాక్ డోర్సే నియమించుకున్నారు. ట్విట్టర్ వినియోగదారుల డేటాను నిల్వ చేసే, నిర్వహించే విధానంలో ముఖ్యమైన సమస్యలను కనుగొన్నట్లు జట్కో చెప్పారు. డేటా భద్రత, తప్పుడు సమాచారం, స్పామ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తాను అనేక మార్గాలను సూచించినట్లు, అయితే ట్విట్టర్ యాజమాన్యం ఆ సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపక పోగా వినియోగదారులను పెంచడంపై దృష్టి పెట్టిందని జట్కో తెలిపారు. ఈ సమయంలోనే మోడీ ప్రభుత్వ ఏజెంట్ ను కూడా కీలక బాధ్యతల్లో ట్విట్టర్ యాజమాన్యం నియమించిందని ఆయన చెప్పారు.

కాగా జట్కో ఆరోపణలను ట్విట్టర్ యాజమాన్యం ఖండించింది. కంపెనీ ప్రతినిధిమాట్లాడుతూ .. "అసమర్థ నాయకత్వం, పేలవమైన పనితీరు కారణంగా జనవరి 2022లో ట్విటర్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నుండి జాట్కో ను తొలగించాము. ప్రస్తుతం జట్కో చేస్తున ఆరోపణలన్నీ అవకాశవాదంతో చేస్తున్నవే. ట్విట్టర్ కస్టమర్లు, దాని వాటాదారుల దృష్టిని ఆకర్షించడానికి, ట్విట్టర్ కు హాని కలిగించడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారు.'' అని ఆరోపించారు.

అయితే మోడీ సర్కార్ ఏజెంట్ ను ట్విట్టర్ లో నియమించారని, ఆయన ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్ లు చేసే వినియోగ దారుల డేటాను మోడీ సర్కార్ కు అంద జేశాడన్న ఆరోపణలపై ట్విట్టర్ ప్రతినిధి స్పంధించలేదు.

ఒక వైపు పెగాసస్ స్పై వేర్ తో దేశంలో ప్రభుత్వ వ్యతిరేక మేధావుల, రచయితల, జర్నలిస్టుల వాట్సప్ చాట్ లపై నిఘా పెట్టిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్, ఇప్పుడు ట్విట్టర్ లో ఏకంగా తమ ఏజెంట్ ను ప్రవేశపెట్టి వినియోగదారుల సమాచారాన్ని తస్కరించారన్న ఆరోపణలు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

First Published:  27 Aug 2022 9:22 AM GMT
Next Story