భారత్ చేతికి జీ-20 అధ్యక్ష పగ్గాలు.. మోడీకి అందించిన ఇండోనేషియా అధ్యక్షుడు
డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ నిర్వర్తించనున్నది. ఈ నెల 8న భారత్‌లో జరుగనున్న జీ-20 సదస్సు లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.
కీలకమైన జీ-20 అధ్యక్ష పగ్గాలు భారత్ చేతికి వచ్చాయి. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశాలు బుధవారం ముగిశాయి. దీంతో వచ్చే ఏడాది ఈ సదస్సును నిర్వహించనున్న ఇండియాకు అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. ఈ మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రధాని మోడీకి అప్పగించారు. ఇందుకు గుర్తుగా సమావేశాలు ముగిసినట్లు ఒక చెక్క సుత్తితో కొట్టి.. అనంతరం దాన్ని మోడీ చేతికి ఇచ్చారు.
కాగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలు, కోవిడ్ దీర్ఘకాలిక దుష్ఫ్రభావాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. అలాంటి సమయంలో భారత్‌కు జీ-20 బాధ్యతలు రావడం గర్వకారణంగా ఉన్నది. ఇలాంటి సమయంలో ప్రపంచమంతా జీ-20 వైపు ఎంతో ఆశగా ఎదురు చూస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే నినాదంతో ఇండియాలో జీ-20 సదస్సును నిర్వహించనున్నట్లు మోడీ తెలిపారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ప్రతీ భారతీయుడికి గర్వకారణమని అన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ నిర్వర్తించనున్నది. ఈ నెల 8న భారత్‌లో జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమంలో జీ-20 సదస్సు లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఇది ఇండియాకు ఒక చారిత్రక సందర్భమని ఆయన పేర్కొన్నారు. లోగోలో ఉన్న లోటస్ ఫ్లవర్ పౌరాణిక వారసత్వానికి గుర్తుగా ఆయన అభివర్ణించారు.
ప్రపంచ జీడీపీలో 85 శాతం ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల సమూహమే జీ-20. ప్రపంచ వాణిజ్యంలో కూడా 75 శాతం ఈ జీ-20 దేశాలదే. అంతటి ప్రాధాన్యత ఉన్న జీ-20కి ఇప్పుడు ఇండియా అధ్యక్షత వహిస్తుండటం గర్వకారణమే. ప్రపంచంలో వర్గాలు ఉండకుండా ఓకే ప్రపంచం ఉండాలనేదే భారత్ ప్రయత్నం. గత ప్రభుత్వాలు కూడా భారత్‌ను ఒక శాంతియుత దేశంగా నడిపించారు. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ద వాతావరణం నెలకొన్న సమయంలో ఇండియా జీ-20 బాధ్యతలు చేపట్టడంతో మిగిలిన ప్రపంచమంతా శాంతి నెలకొంటుందనే ఆశాభావంతో ఉన్నది.
Indonesian President Joko Widodo "HAND OVER #G20 PRESIDENCY TO INDIA "@narendramodi#G20 #G20India #G20Indonesia pic.twitter.com/GNziUlIt5r
— G20 India (@G20_India) November 16, 2022