అమెరికా చరిత్రలోనే తొలిసారి.. అవిశ్వాసంతో స్పీకర్ తొలగింపు
మెకార్థీపై వ్యతిరేకత మరింత పెరిగింది. పదవిని కాపాడుకునేందుకు ఆయన డెమోక్రాట్లతో చేతులు కలిపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఆయనపై రిపబ్లికన్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ను అవిశ్వాస తీర్మానంతో తొలగించారు. సుదీర్ఘ ఓటింగ్ తర్వాత ఈ ఏడాది జనవరిలోనే స్పీకర్ పదవి చేపట్టిన కెవిన్ మెకార్థీ.. 10 నెలలు తిరగకుండానే ఉద్వాసనకు గురికావడం గమనార్హం. ఇలా ఓ స్పీకర్‌ని బలవంతంగా పదవీచ్యుతుడిని చేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.
గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఎగువ సభ సెనేట్‌ను కైవసం చేసుకున్న అధికార డెమోక్రటిక్ పార్టీ.. ప్రజాప్రతినిధుల సభలో మాత్రం మెజారిటీ సాధించలేకపోయింది. దిగువ సభలోని మొత్తం 435 సీట్లకు గాను డెమోక్రాట్లు 213 సీట్లు గెలవగా.. ప్రతిపక్ష రిపబ్లికన్లు 222 సీట్లు సాధించి మెజారిటీ పక్షంగా నిలిచారు. మెజారిటీ సాధించినప్పటికీ స్పీకర్‌ని ఎన్నుకోవడానికి రిపబ్లికన్లు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రిపబ్లికన్ల మధ్య అంత సులువుగా ఏకాభిప్రాయం కుదరలేదు. నాలుగు రోజుల పాటు ఏకంగా 15 దఫాలు ఓటింగ్ నిర్వహించగా.. చివరికి కెవిన్ మెకార్థీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఆ సమయంలో మెకార్థీ.. పదవిని చేజిక్కించుకోవడం కోసం పార్టీ నేతలతో ఓ ఒప్పందం చేసుకున్నారు. తన ఉద్వాసనకు ఒక్క రిపబ్లికన్ సభ్యుడు డిమాండ్ చేసినా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు సమ్మతిస్తానన్న చెప్పారు. ఇప్పుడదే ఒప్పందంతో మెకార్థీపై రిపబ్లికన్ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాసం తీసుకొచ్చారు. మ్యాట్ గేజ్ ఈ ఏడాది జనవరిలో స్పీకర్ పదవి కోసం మెకార్థీతో తీవ్రంగా పోటీపడిన రిపబ్లికన్ నేత కావడం గమనార్హం.
పలుమార్లు వ్యతిరేకతలు.. ఫిర్యాదులు..
స్పీకర్ పదవి చేపట్టిన నాటి నుంచి మెకార్థీకి పలుమార్లు వ్యతిరేకత ఎదురైంది. హామీలను నిలబెట్టుకోలేదన్న ఫిర్యాదులూ వచ్చాయి. ఈ క్రమంలోనే గత వారాంతంలో అమెరికా ఫెడరల్ ప్రభుత్వాన్ని షట్ డౌన్ ముప్పు నుంచి తొలగించేందుకు ఆయన తీసుకున్న చర్యలు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందిలేకుండా చేసే స్వల్పకాల బిల్లులను గతవారం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. వాటిని రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించగా, దేశ ప్రజలకు కలిగే ఇబ్బందులు నివారించేందుకు బిల్లులను ఆమోదించాలని సభ్యులను స్పీకర్ మెకార్థీ ప్రత్యేక చొరవ తీసుకుని కోరడంతో ఆయన మాటకు తలొగ్గి రిపబ్లికన్లు ఆ బిల్లులకు ఆమోదం తెలిపారు.
ఈ పరిణామంతో మెకార్థీపై వ్యతిరేకత మరింత పెరిగింది. పదవిని కాపాడుకునేందుకు ఆయన డెమోక్రాట్లతో చేతులు కలిపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఆయనపై రిపబ్లికన్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చేపట్టిన ఓటింగ్‌లో 216–220 ఓట్లతో అవిశ్వాసం నెగ్గింది. ఫలితంగా మెకార్థీని పదవి నుంచి తొలగించి.. స్పీకర్ పదవి ఖాళీ అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి మరో రిపబ్లికన్ నేత పాట్రిక్ హెన్రీకి తాత్కాలిక స్పీకర్ బాధ్యతలు అప్పగించారు. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.