Telugu Global
International

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తోషాఖానా కేసులో జైలుశిక్ష నిలిపివేత

2018-2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు విలువైన బహుమతులను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే కేసే తోషాఖానా. దీనిపై గత ఏడాదిలోనే కేసు నమోదు అయింది.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తోషాఖానా కేసులో జైలుశిక్ష నిలిపివేత
X

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు, ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ జిల్లా జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదల కానున్నారు.

2018-2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు విలువైన బహుమతులను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే కేసే తోషాఖానా. దీనిపై గత ఏడాదిలోనే కేసు నమోదు అయింది. ఆగస్టు 5న ఇమ్రాన్ ఖాన్‌కు ట్రయిల్ కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. ఐదేళ్ల పాటు రాజకీయాల నుంచి బహిష్కరణ వేటు పడింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలుకు తరలించారు. అయితే జైలు శిక్ష విధించడాన్ని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌ హైకోర్టులో సవాలు చేశారు. సోమవారం నాడు విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమీర్ ఫారుక్, జస్టిస్ తారీఖ్ మహమ్మద్ జహంగీర్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఆ తీర్పుని ప్రకటించింది. హైకోర్టు ఇమ్రాన్‌కు విధించిన జైలుశిక్షను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది.

ప్రస్తుతం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జిల్లా జైలులో ఇమ్రాన్‌ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కారాగారంలో వసతులపై తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తాజాగా కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించారు. అయితే ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆయ‌న ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌నున్నారు.

*

First Published:  29 Aug 2023 4:49 PM IST
Next Story