Telugu Global
International

చైనా వస్తువుల్లాగే చైనా టీకాలు కూడా నాసిరకమేనా..?

చైనా తయారీ కరోనా వ్యాక్ లో మాత్రం mRNA టెక్నాలజీ లేదు. దీన్ని తీసుకోవడం వల్ల చైనీయులకు తగినంత మేర రోగనిరోధకత లభించలేదని తెలుస్తోంది.

చైనా వస్తువుల్లాగే చైనా టీకాలు కూడా నాసిరకమేనా..?
X

చైనా వస్తువుల ధర తక్కువ, అలాగే నాణ్యత కూడా తక్కువే. కనీసం ప్రాణాధారమైన వ్యాక్సిన్ తయారీలో కూడా చైనా కక్కుర్తి పడిందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. చైనా వ్యాక్సిన్ల నాణ్యత తక్కువగా ఉండటం, దాని తయారీ కోసం పాత టెక్నాలజీని వాడటం వల్ల ఆ వ్యాక్సిన్ కి కరోనా లొంగలేదని, అందుకే ఇప్పుడు అక్కడ మరోసారి కొవిడ్ విజృంభిస్తోందని అంటున్నారు.

లోకల్ మేడ్..

కరోనా నిరోధానికి చాలా రకాల వ్యాక్సిన్లు వచ్చాయి. భారత్ తయారీ కొవాక్సిన్, కొవిషీల్డ్ ని ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి. చాలా చోట్ల ఈ వ్యాక్సిన్లను ఉపయోగించారు. అయితే చైనాలో మాత్రం కేవలం చైనా తయారీ లోకల్ వ్యాక్సిన్ ని వాడారు. సినో ఫార్మా తయారు చేసిన కరోనా వ్యాక్ అనే టీకాను మాత్రమే అక్కడ వినియోగించారు. ఇతర టీకాలన్నీ mRNA టెక్నాలజీతో తయారు చేశారు, దీనివల్ల మెరుగైన రోగ నిరోధకత లభిస్తుంది. కానీ చైనా తయారీ కరోనా వ్యాక్ లో మాత్రం mRNA టెక్నాలజీ లేదు. దీన్ని తీసుకోవడం వల్ల చైనీయులకు తగినంత మేర రోగనిరోధకత లభించలేదని తెలుస్తోంది. ఇతర వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకుంటే సరిపోతుంది, కానీ కరోనా వ్యాక్ మూడు డోసుల టీకా. అయితే చైనాలో మూడో డోసు చాలామందికి లభించలేదు. బూస్టర్ ని అందరూ లైట్ తీసుకున్నారు. దీంతో కరోనా మళ్లీ విజృంభించిందని అంటున్నారు.

జీరో కొవిడ్ తో ముప్పు..

భారత్ లో కొవిడ్ కేసులు తగ్గుతున్నప్పుడే అన్నిటికీ గేట్లు బార్లా ఎత్తేశారు. ఓ దశలో విమర్శలు చెలరేగినా కొవిడ్ కనీసం ఓసారి సోకడం ద్వారా సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి అందరిలో పెరిగింది. దీంతో ఆ తర్వాత కొవిడ్ లక్షణాలున్నా ఆస్పత్రిలో చేరుతున్న కేసులు తక్కువయ్యాయి. మరణాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. కానీ చైనాలో జీరో కొవిడ్ పేరుతో పూర్తిగా కొవిడ్ ని అంతమొందించాలని ప్రజల్ని ఆంక్షల మధ్యలోనే ఉంచింది ప్రభుత్వం. దీంతో ప్రజలకు సహజ రోగనిరోధకత పెరగలేదు. అటు వ్యాక్సిన్ వీక్ కావడంతో కృత్రిమ రోగనిరోధక శక్తి కూడా లేదు. దీంతో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయని తెలుస్తోంది.

First Published:  24 Dec 2022 5:19 PM IST
Next Story