ట్రంప్‌నకు క్షమాపణ చెప్పను.. జెలెన్ స్కీ శాంతిని ఆకాంక్షించే వ్యక్తి కాదు
వైట్‌హౌస్‌లో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య తీవ్ర వాగ్వాదంపై స్పందించిన ప్రతిపక్ష డెమోక్రాట్లు సహా ప్రపంచ దేశాధినేతలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే.. లేదంటే మీ దారి మీరు చూసుకోండి' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాల తవ్వకాలు అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి వైట్‌హౌస్ కు వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్, వాన్స్, జెలెన్‌స్కీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఖనిజాల ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య చర్చ అర్ధాంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే. అనంతరం జెలెన్ స్కీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉన్నదా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ ట్రంప్‌నకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను ఏదో తప్పుచేశానని అనుకోవడం లేదన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని, అమెరికా ప్రజలను గౌరవిస్తానన్న జెలెన్‌స్కీ ఇది ,చాలా కఠినమైన పరిస్థితి అని.. ఇందులో స్నేహం ఎక్కడ ఉన్నది అంటూ అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతపరమైన హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. ట్రంప్, పుతిన్ చర్చలపైనా జెలెన్ స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని, తమవైపే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఓవెల్ ఆఫీసులోని ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు. రష్యాపై ఉన్న అభిప్రాయాన్ని తాను మార్చుకోలేనని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
మరోవైపు వైట్ హౌస్ ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ... జెలెన్ స్కీ శాంతిని ఆకాంక్షించే వ్యక్తి కాదని మండిపడ్డారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. శాంతి చర్చలకు జెలెన్‌స్కీ తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు అతి చేశారని వ్యాఖ్యానించారు. అమెరికాకు తక్షణ శాంతి కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా శాంతినే కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్‌లో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య తీవ్ర వాగ్వాదంపై ప్రతిపక్ష డెమోక్రాట్లు సహా ప్రపంచ దేశాధినేతలు స్పందించారు. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన చెడు పనులు చేస్తున్నారని.. వారు పుతిన్‌వైపే ఉన్నారని డెమోక్రాట్లు ఆక్షేపించారు. జెలెన్‌స్కీ ఒంటరి కాదని తాము ఉక్రెయిన్‌తో శాంతికోసం కలిసి పనిచేస్తామని ఐరోపా చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అన్నారు. బలంగా, భయరహితంగా ఉండాలని ఐరోపా కమిషన్‌తో పాటు ఐరోపా మండలి అధ్యక్షులు పేర్కొన్నారు. యుద్ధంలో ఉక్రెయిన్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా మిత్ర దేశం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. పుతినే మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలు ఆడుతున్నారని పేర్కొన్నారు. యుద్ధంలో ఎవరు బాధితులో ఎవరు దురాక్రమణదారులో తమకు తెలుసు అని ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని జర్మనీకి కాబోయే ఛాన్స్‌లర్ తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి ఇక ఆలస్యం చేయకుండా సమావేశం అవ్వాలని ఐరోపా అమెరికా దేశాలకు ఇటలీ సూచించింది. నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, స్వీడన్ దేశాలు ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నాయి. ఉక్రెయిన్ తమ స్వాతంత్య్రం కోసమే కాకుండా అందరి కోసం పోరాడుతున్నదని కెనెడా తెలిపింది. కీవ్‌కు మద్దతుగా ఉంటామని డెన్మార్క్ తెలిపింది. హంగేరీ మాత్రం భిన్నంగా అమెరికాను సమర్థించింది. శాంతి కోసం ట్రంప్ ధైర్యం నిలబడినారని, మూర్ఖులే యుద్ధాన్ని కోరుకుంటారని హంగేరి ప్రధాని అన్నారు. తమకు మద్దతుగా నిలిచిన దేశాలకు జెలెన్‌స్కీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.