Telugu Global
International

మరో కీలక నేతను కోల్పోయిన హెజ్‌బొల్లా

బీరుట్‌పై ఇజ్రాయెల్‌ చేసిన భీకర దాడుల్లో హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయ కమాండర్‌ సోహిల్‌ హుసైన్‌ హుసైనీ మృతి

మరో కీలక నేతను కోల్పోయిన హెజ్‌బొల్లా
X

హెజ్‌బొల్లా కీలక నేతలే లక్ష్యంగా సోమవారం ఇజ్రాయెల్‌ భారీస్థాయిలో దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయ కమాండర్‌ సోహిల్‌ హుసైన్‌ హుసైనీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) మంగళవారం ప్రకటించాయి. 'హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం అధిపతి సోహిల్‌ హుసైన్‌ హుసైనీ ఐడీఎఫ్‌ హతమార్చింది. సోమవారం ఇంటెలిజెన్స్‌ విభాగం అందించిన కచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడుల్లో హుసైనీ మృతి చెందారు' అని ఇజ్రాయెల్‌ దళాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై హెజ్‌బొల్లా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.

హమాస్‌ కీలక నేతలే లక్ష్యంగా కొంతకాలంగా ఇజ్రాయెల్‌ భారీ క్షిపణులతో విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలోనే సోమవారం గాజా యుద్ధానికి ఏడాది పూర్తవడంతో హమాస్‌, బీరుట్‌పై ఏకకాలంలో బాంబుల వర్షం కురిపించింది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా విరామం లేకుండా వైమానిక దాడులకు పాల్పడింది.

ఇజ్రాయెల్‌ పైకి ప్రొజెక్టైల్స్‌ ప్రయోగం

లెబనాన్‌ వైపు నుంచి ఇజ్రాయెల్‌ పైకి ప్రొజెక్టైల్స్‌ ప్రయోగించింది.ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ద్వారా ఐదు ప్రొజెక్టైల్స్‌ లో కొన్నింటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. సెంట్రల్‌ ఇజ్రాయెల్‌లో సైరన్‌ మోతలు వినిపించడంతో అప్రమత్తమైంది. టెల్‌ అవీవ్‌లోని ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటలీజెన్స్‌ బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నామని హెజ్‌బొల్లా పేర్కొన్నది. యూనిట్‌ 8200 రాకెట్లతో దాడి చేసినట్లు వెల్లడించింది.

First Published:  8 Oct 2024 6:36 AM GMT
Next Story