Telugu Global
International

గూగుల్ పీకేసింది.. మాజీల‌తో క‌లిసి కొత్త కంపెనీ..!

హిన్రీ కిర్క్‌. గూగుల్‌లో త‌న‌లా లేఆఫ్ అందుకున్న మ‌రో ఆరుగురు ఉద్యోగుల‌ను క‌లుపుకొని న్యూయార్క్‌, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్‌, డెవ‌ల‌ప్‌మెంట్ స్టూడియో నెల‌కొల్ప‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

గూగుల్ పీకేసింది.. మాజీల‌తో క‌లిసి కొత్త కంపెనీ..!
X

ఐటీలో లేఆఫ్‌ల త‌రుణం.. వేల‌కొద్దీ ఉద్యోగాలు పెరికేస్తుండ‌టంతో ఉద్యోగుల్లో దిక్కుతోచ‌ని ప‌రిస్థితి. ల‌క్ష‌ల రూపాయ‌ల జీతం అందుకుంటున్న‌వారు ఒక్క‌సారిగా వ‌చ్చిన కుదుపుతో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అన్ని కంపెనీల‌దీ ఇదే బాట కావడంతో కొత్త ఉద్యోగం సాధించుకోవ‌డం కోసం నానా తంటాలు ప‌డుతున్నారు. ఇక పెద్ద కంపెనీలు కూడా ఇదే విధంగా లేఆఫ్‌లు ప్ర‌క‌టిస్తుండ‌టంతో ఆయా ఉద్యోగుల ప‌రిస్థితి కూడా అగ‌మ్య‌గోచ‌రంగా మారింది.

గూగుల్ ఇటీవ‌ల సంక్షోభ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించ‌డం కోసం ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు ఉప‌క్ర‌మించింది. 12 వేల మందికి లేఆఫ్‌లు ఇచ్చింది. అలా లేఆఫ్ అందుకున్న వారిలో అత‌నూ ఒక‌డు. గూగుల్‌లో అత‌నో సీనియ‌ర్ మేనేజ‌ర్‌. దాదాపు ఎనిమిదేళ్ల‌పాటు అదే హోదాలో ప‌నిచేశాడు. ల‌క్ష‌ల రూపాయ‌ల్లో జీతం. అంత‌లోనే ఊహించ‌ని ప‌రిణామం. హాయిగా సాగిపోతున్న ఉద్యోగం ఒక్క‌సారిగా ఊడిపోయింది.

అయినా ఉద్యోగం పోయింద‌ని అత‌ను కుంగిపోలేదు.. వేరొక ఉద్యోగం కోసం వేరొక కంపెనీ వైపు చూడ‌లేదు. ఈ సంక్షోభాన్ని కూడా త‌న జీవిత గ‌మ‌నాన్ని మార్చుకోవ‌డానికి అవ‌కాశంగా మ‌లుచుకోవాల‌ని భావించాడు. అదీ త‌న లేఆఫ్ పీరియ‌డ్ పూర్త‌య్యేలోపే చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా.. త‌న‌లానే ఉద్యోగం కోల్పోయిన‌వారిని క‌లుపుకొన్నాడు. కొత్త‌గా కంపెనీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించాడు. త‌న ఉద్యోగం లేఆఫ్ పీరియ‌డ్ పూర్త‌య్యేలోపు దానిని స్థాపించాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నాడు.

అత‌ని పేరు హిన్రీ కిర్క్‌. గూగుల్‌లో త‌న‌లా లేఆఫ్ అందుకున్న మ‌రో ఆరుగురు ఉద్యోగుల‌ను క‌లుపుకొని న్యూయార్క్‌, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్‌, డెవ‌ల‌ప్‌మెంట్ స్టూడియో నెల‌కొల్ప‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

కొత్త కంపెనీ ఏర్పాటు విష‌యంపై హెన్రీ ఇటీవ‌ల లింక్డిన్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. మార్చిలో త‌న లేఆఫ్ పీరియ‌డ్ పూర్తికానుంద‌ని, త‌న గ‌డువు పూర్త‌య్యేలోగా కొత్త కంపెనీ ఏర్పాటు చేయాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నాడు. అనుకోని సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌లుచుకోవాల‌ని ఈ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిపాడు. తాను నెల‌కొల్ప‌బోయే కంపెనీ ద్వారా డిజైన్‌, రీసెర్చ్ టూల్స్ అందించ‌నున్న‌ట్టు వెల్ల‌డించాడు. అందుకోసం యూజ‌ర్ల సపోర్ట్ కావాల‌ని కోరాడు. వారం క్రితం హెన్రీ పెట్టిన‌ పోస్ట్‌కు భారీగా స్పంద‌న వ‌చ్చింది. 15 వేలకు పైగా రియాక్ష‌న్స్ వ‌చ్చాయి. దాదాపు 1000 కామెంట్లు, 1300 రీపోస్ట్‌లు ల‌భించాయి.

First Published:  22 Feb 2023 8:05 AM IST
Next Story