Telugu Global
International

కుప్పకూలిన ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్‌.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

కుప్పకూలిన ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్‌.. కొనసాగుతున్న సహాయక చర్యలు
X

ఇరాన్‌ ప్రెసిడెంట్‌ ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్‌లో ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సెన్‌ అమీర్‌ అబ్దుల్లా హియన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పర్వత శ్రేణులను దాటుతున్న క్రమంలో దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్‌ కూలిపోయిందని ఇరాన్ అధికారులు చెప్తున్నారు. హెలికాప్టర్‌లో ఉన్న వారు క్షేమంగా ఉన్నారా, లేదా అనేది ఇప్పటివరకూ తెలియలేదు. హెలికాప్టర్‌ జాడను గుర్తించేందుకు ఇప్పటికే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది.

ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో కిజ్‌ కలాసి, ఖొదావరిన్‌ పేరుతో రెండు డ్యాంలను రెండు దేశాలు సంయుక్తంగా నిర్మించాయి. ఆదివారం అజర్‌బైజన్ ప్రెసిడెంట్‌ ఇల్హమ్‌ అలియేవ్‌తో కలిసి ఇబ్రహీం రైసీ రెండు డ్యాంలను ప్రారంభించారు. తర్వాత విదేశాంగ మంత్రి హుస్సెన్ అమీర్ అబ్దుల్లా హియన్‌, ఈస్ట్‌ అజర్‌బైజన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్‌ ప్రావిన్స్‌ ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్‌ టౌన్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరారు రైసీ. కాగా, జోల్ఫా సిటీకి సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ వాతావరణం అనుకూలించక అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైందని ఇరాన్‌ మీడియా స్పష్టం చేసింది.

ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పర్వతాలతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం కావడం, కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్తున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రెస్క్యూ విమానం సైతం ల్యాండ్ కాలేకపోయిందంటున్నారు అధికారులు. ప్రతికూల వాతావరణం వల్ల గగనతల సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు - ప్రమాద స్థలానికి సమీపంలో సాధారణ, ఎయిర్‌ అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.

First Published:  20 May 2024 8:04 AM IST
Next Story
null