Telugu Global
International

మంచు తుపానుతో అల్లాడుతున్న అమెరికా.. - తుపాను ముప్పులో 20 కోట్ల మంది

మ‌రోప‌క్క మంచు తుపాను ధాటికి విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల సామర్థ్యం ప‌డిపోతోంది. దీంతో అక్క‌డ అనేక ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అనేక ప్రాంతాలు అంధ‌కారంలో బిక్కుబిక్కుమంటూ గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

మంచు తుపానుతో అల్లాడుతున్న అమెరికా.. - తుపాను ముప్పులో 20 కోట్ల మంది
X

అగ్ర రాజ్యం అమెరికాలో మంచు తుపాను బీభ‌త్సం సృష్టిస్తోంది. అక్క‌డి ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ 50 డిగ్రీల‌కు ప‌డిపోయాయి. అప్పుడే కాచిన వేడి నీళ్లు కూడా సెక‌న్ల వ్య‌వ‌ధిలో గ‌డ్డ క‌ట్టిపోతున్నాయంటే అక్క‌డి ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. తుపాను ప్ర‌భావంతో ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 21 మంది మృతిచెందారు. రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వ‌డం వ‌ల్లే వీరిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు స‌మాచారం. మంచు కురిసిన ర‌హ‌దారుల‌పై వాహ‌నాల‌ను అదుపు చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదాలు జ‌రిగిన‌ట్టు తెలిసింది. దీంతో ప‌లు ర‌హ‌దారుల‌పై వాహ‌నాల రాక‌పోక‌ల‌ను అక్క‌డి అధికారులు నిషేధించారు.

మ‌రోప‌క్క మంచు తుపాను ధాటికి విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల సామర్థ్యం ప‌డిపోతోంది. దీంతో అక్క‌డ అనేక ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అనేక ప్రాంతాలు అంధ‌కారంలో బిక్కుబిక్కుమంటూ గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దాదాపు 20 ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. అమెరికాలోని 20 కోట్ల మంది ప్ర‌జ‌లకు మంచు తుపాను ప్ర‌భావంతో ముప్పు నెల‌కొంద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు మంచు తుపాను ధాటికి విమాన రాక‌పోక‌ల‌ను కూడా అక్కడి అధికారులు ర‌ద్దు చేశారు. ఆదివారం నాటికి అమెరికాలో 6 వేల విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు తెలిసింది. అమెరికాలోని 13 రాష్ట్రాల్లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించారు. ప్ర‌యాణాల‌కు అవ‌కాశం లేక క్రిస్మ‌స్ సెల‌వుల్లోనూ ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే చిక్కుకుపోయారు. విద్యుత్ కోత‌లు మ‌రింత పెర‌గ‌నున్నాయ‌నే అంచ‌నాల‌తో అక్క‌డి ప్ర‌జ‌లు మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. విద్యుత్ పొదుపు నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మైన మేర‌కు మాత్ర‌మే హీట‌ర్లు వాడాల‌ని అక్క‌డి అధికారులు సూచించారు. స్ట‌వ్‌లు, డిష్ వాష‌ర్‌ల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని, వాతావ‌ర‌ణ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే సుదీర్ఘ విద్యుత్ కోత‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని 13 రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

First Published:  25 Dec 2022 10:01 AM IST
Next Story