Telugu Global
International

ఏమీ చేయడు.. కానీ గంటకు రూ.5,500 సంపాదన.. అదెలాగో తెలుసా?

ఆ వ్యక్తి పేరు షోజి మోరిమోటో(38). జపాన్‌లో ఉండే షోజీ తక్కువలో తక్కువ రోజుకు రూ.10 వేలు ఆర్జిస్తున్నాడు. దీనికోసం తనకొక వింత జాబును అతనే సృష్టించుకున్నాడు. అదేంటంటే.. ఒంటరి వాళ్లకు తోడు ఉండటం.

ఏమీ చేయడు.. కానీ గంటకు రూ.5,500 సంపాదన.. అదెలాగో తెలుసా?
X

కొంతమంది రోజంతా పడి పడి పనిచేసినా కూడా రూ.500 సంపాదించలేకపోతున్నారు. మరికొంత మంది నానా తిప్పలు పడి కాస్త బాగానే సంపాదిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏమాత్రం కష్టపడడు. కూర్చొని రోజుకూ వేలల్లో సంపాదిస్తున్నాడు. ఇటు పుల్ల తీసి అటు పెట్టడు కానీ గంటకు రూ.5,500 సంపాదిస్తున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయనే నానుడి ఈ వ్యక్తికి మాత్రం వర్తించదు. ఇతనికి కూర్చొని కబుర్లు చెబితే చాలు.. గంటకు వేలకు వేలు వచ్చిపడతాయి.

ఆ వ్యక్తి పేరు షోజి మోరిమోటో(38). జపాన్‌లో ఉండే షోజీ తక్కువలో తక్కువ రోజుకు రూ.10 వేలు ఆర్జిస్తున్నాడు. దీనికోసం తనకొక వింత జాబును అతనే సృష్టించుకున్నాడు. అదేంటంటే.. ఒంటరి వాళ్లకు తోడు ఉండటం. ఒంటరిగా ఉన్నవాళ్లకు వాళ్లు రోజులో కోరకున్నంత సేపు తోడు ఉంటాడు. దీనికోసం అతను గంటకు కొంత డబ్బును అతను చార్జ్ చేస్తాడు. ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉంటూ కాసేపైనా మనతో ఎవరైనా ఉంటే బాగుండు అనుకునే వారు చాలా మందే ఉంటారు. వాళ్లు గంట చొప్పున ఇతడిని బుక్ చేసుకుంటారు. అలా తనను బుక్ చేసుకున్న క్లైంట్‌ల వద్దకు వెళ్లి.. వారికి సరదాగా కబుర్లు చెబుతాడు. వాళ్లు చెప్పే మాటలు వింటాడు.

కేవలం కూర్చొని వాళ్లకు కబుర్లు చెప్పడమో.. వారు చెప్పేవి వినడమో మినహా ఇతర సాయమేదీ అతను చేయడు. ఆశ్యర్యమేంటంటే.. ఇతడిని ఎక్కువగా మహిళలే అద్దెకు తీసుకుంటారట. అయినప్పటికీ ఇతడు వాళ్ల వద్ద అడ్వాంటేజ్ తీసుకోడట.. వాళ్లే కోరినా దాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడట. ఇక షోజీకి ట్విటర్‌లో 1.25మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఫాలోవర్లకు ఇతని గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్లే ఇతడిని రెంట్‌కు తీసుకుంటారట. ఇప్పటి వరకు ఒక క్లైయింట్ అత్యధికంగా 270సార్లు ఇతడిని అద్దెకు తీసుకుందట. తాను ఏ పని చేయకుండా డబ్బులు సంపాదిస్తున్నా అనుకోవడం రాంగ్ అని.. తాను చేస్తున్నది బాధ్యతాయుతమైన పనేనని షోజీ చెబుతున్నాడు. మనోడు తను క్రియేట్ చేసుకున్న జాబ్‌తో కోట్లు కూడబెట్టాడట.

First Published:  11 Nov 2022 9:08 PM IST
Next Story