Telugu Global
International

మాకు ఇరాన్‌ మద్దతు ఉంది.. - హమాస్‌

హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం ఉండి ఉంటుందని ఇజ్రాయిల్‌ ఇప్పటివరకు బలంగా నమ్ముతూ వస్తుండగా, దానిని నిజం చేస్తూ తాజాగా హమాస్‌ సంస్థ ప్రకటించింది.

మాకు ఇరాన్‌ మద్దతు ఉంది.. - హమాస్‌
X

ఇజ్రాయిల్‌పై వేలకొద్దీ రాకెట్లతో ఆకస్మికంగా విరుచుకుపడిన మిలిటెంట్‌ సంస్థ హమాస్‌.. తద్వారా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 200 మందికి పైగా ఇజ్రాయిల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో పాటు తమ సరిహద్దు భద్రతా విధుల్లో ఉన్న సైనికులను కూడా హమాస్‌ అదుపులోకి తీసుకుందని ఇజ్రాయిల్‌ మండిపడింది. మరోపక్క ఎదురుదాడికి దిగిన ఇజ్రాయిల్‌.. గాజాపై దాడులు చేయగా, 232 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. 1100 మందికి పైగా గాయాలపాలయ్యారు.

హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం ఉండి ఉంటుందని ఇజ్రాయిల్‌ ఇప్పటివరకు బలంగా నమ్ముతూ వస్తుండగా, దానిని నిజం చేస్తూ తాజాగా హమాస్‌ సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి ఘాజీ హమీద్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ దాడికి ఇరాన్‌ మద్దతు ఉందని వెల్లడించారు. మరోవైపు ఇరాన్‌ కూడా హమాస్‌ దాడిని ఆత్మరక్షణ చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఇరాన్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అణచివేతకు గురైన పాలస్తీనా ప్రజలు ఆత్మరక్షణ కోసం చేసిన దాడిగా దీనిని పేర్కొంది.

మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఫోనులో చర్చలు జరిపారు. వెస్ట్‌ బ్యాంక్లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలని కోరారు. అదే క్రమంలో ఇజ్రాయిల్‌పై జరిగిన ఉగ్ర దాడులను ఖండిస్తున్నట్టు బ్లింకన్‌ స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలోని దేశాలు కూడా ఈ దాడిని ఖండించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని పాలస్తీనా అథారిటీ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.

First Published:  8 Oct 2023 12:05 PM IST
Next Story