Telugu Global
International

హమాస్‌ అగ్రనేత యహ్యా సిన్వర్‌ హమాస్‌ హతం

హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ

హమాస్‌ అగ్రనేత యహ్యా సిన్వర్‌ హమాస్‌ హతం
X

గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌ భారీ విజయాన్ని సాధించింది. అక్టోబర్‌ 7 దాడుల సూత్రధారి.. హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ అధినేత యహ్యా సిన్వర్‌ హమాస్‌ను హతమార్చింది. ఈ విషయాన్ని గురువారం ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ మంత్రి కాంట్జ్‌ ధృవీకరించారు. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘన విజయం. ఇరాన్‌ నేతృత్వంలోని రాడికల్‌ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్‌ ఏరివేతతో తక్షణ కాల్పుల విరమణఖు, బందీల విడుదలకు మార్గం సుగమం కానున్నదని ఆయన పేర్కొన్నారు.

హమాస్‌ మాస్టర్‌మైండ్‌

యహ్యా సిన్వర్‌ హమాస్‌ మాస్టర్‌మైండ్‌.. వేలాదిమంది ఇజ్రాయెల్‌ సైనికులు, డ్రోన్లు, నిఘా వర్గాలు ఏడాదికాలంగా ప్రయత్నించినా కనీసం ఎక్కడున్నాడన్న ఆచూచీ పసిగట్టలేకపోయారు. అయితే ఇజ్రాయెల్‌ ట్రైనీ సైనికులు సిన్వర్‌ను మట్టుబెట్టడం సంచలనం సృష్టించింది. ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. అదే సమయంలో ఒక భవనం నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో డ్రోన్ల సాయంతో సైనికులు దాడి చేయడం ప్రారంభించారు. భారీ ఎత్తున బాంబులను ఆ భవనంపైకి ప్రయోగించారు. కాసేపటికి అక్కడి నుంచి కాల్పులు ఆగిపోయాయి. దీంతో దళాలు అక్కడికి చేరుకోగా ముగ్గురి మృతదేహాలు దొరికాయి.

మొదట గుర్తుపట్టలేదు

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) ముగ్గురిని మట్టుబెట్టింది. మొదట సిన్వర్‌ మృతి చెందిన విషయాన్ని వాళ్లు గుర్తించలేదు. తర్వాత నిఘావర్గాలు రంగంలోకి దిగి సిన్వర్‌ మృతదేహాన్ని గుర్తించాయి. గతంలో అతను ఇజ్రాయెల్‌ కష్టడీలో ఉండటంతో సేకరించిన డీఎన్‌ఏ, దంత నమూనా సాయంతో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయగా అది హమాస్‌ అగ్రనేత అని తేలింది. మరోవైపు ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్‌ చేసిన పలువురిని సిన్వర్‌ తన రక్షణ కవచంగా వినియోగించేవాడు. గాజా యుద్ధానికి కారణహైన అక్టోబర్‌ 7 మారణహోమానికి సూత్రధారి సిన్వరేనని మొదటి నుంచి ఇజ్రాయెల్‌ బలంగా విశ్వసిస్తున్నది. గత ఏడాది ఇజ్రాయెల్‌ సరిహద్దులపై హమాస్‌ చేసిన దాడుల్లో 1200 మంది మృతి చెందగా.. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లింది. ఇంకా హమాస్‌ వద్ద 100 మంది బందీలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంవత్సరకాలంగా ఐడీఎఫ్‌ సొరంగాల్లో ఆయన కోసం వేట కొనసాగిస్తున్నది. కొన్నిసార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడని పేర్కొన్నది. అయితే దాడి తర్వాత ఆ భవనంలో ముగ్గురు తప్పా మరెవరీ ఆచూకీ లభ్యం కాలేదు. గాజా సొరంగాల్లో వారి దాచిపెట్టారని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

యుద్ధం ఆగదు

అయితే దీనిపై స్పందించిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశామన్నారు. అయితే యుద్ధం మాత్రం ఆగదన్నారు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమన్నారు. ఇక హమాస్‌ ఎంతమాత్రం గాజాను నియంత్రించలేదన్నారు. అయితే తమ నాయకుడి మరణంపై హమాస్‌ ఇంకా స్పందించలేదు.


First Published:  18 Oct 2024 7:27 AM IST
Next Story