గూగుల్ వంటి సంస్థల్లోనూ కుల వివక్ష: మాజీ సీనియర్ మేనేజర్ తనూజా గుప్త
భారత్ లో ఉన్న కులం కంపు మనం వెళ్ళిన అన్ని దేశాలకు విస్తరిస్తోంది. అమెరికాలో కూడా భారతీయులు పని చేస్తున్న అనేక చోట్ల కుల వివక్ష కొనసాగుతోంది. గూగుల్ కంపెనీలో సాగుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి బైటికి వచ్చిన తనూజా గుప్తా ఏం చెప్తోందో వినండి....
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగూల్ సంస్థలో కూడా కుల వివక్ష కొనసాగుతుందని ఆరోపించిన గూగుల్ న్యూస్ విభాగం వ్యవస్థాపకురాలు, సీనియర్ మేనేజర్ గా పనిచేసిన తనూజ గుప్తా గత ఏప్రెల్ లో గూగుల్ కు రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన సంఘటనల గురించి, గూగుల్ లో కొనసాగుతున్న కుల వివక్ష గురించి ఈ మధ్య ఆమె 'ది న్యూయార్కర్' కి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2011 నుంచి గూగుల్ కోసం పని చేసిన తన ప్రస్థానాన్ని, రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను ఆమె వివరించారు.
తన విధులలో భాగంగా ఆమె కులవివక్ష పై నిర్వహించాల్సిన ఒక చర్చా కార్యక్రమాన్ని సంస్థ రద్దు చేసింది. అంతేగాక దీనిపై ఆ సంస్థ హెచ్ ఆర్ విభాగంతో దర్యాప్తు చేయించి తన ప్రవర్తనను, కార్యక్రమాలను తప్పుబడుతూ కాండక్ట్ వార్నింగ్ ఇచ్చిందని ఆమె తెలిపారు. దీనిపై కంపెనీ విధానాలతో విభేదించి సంస్థకు రాజీనామా చేయాల్సి వచ్చిందని తనూజ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె ఉద్యోగిగానే కాక లింగ, కుల వివక్షపై పోరాడే యాక్టివిస్ట్ గా కూడా పనిచేస్తున్నారు.
గూగుల్ లో కుల వివక్ష పై మాట్లాడేందుకు అమెరికాలో ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే లాభాపేక్షలేని దళిత పౌర హక్కుల సంస్థ వ్యవస్థాపకురాలు తేన్‌మొళి సౌందరరాజన్‌ని ఆమె ఆహ్వానించారు. ఉద్యోగులు బెదిరిపోతున్నారంటూ చివరికి ఆ చర్చను రద్దు చేశారని తనూజ తెలిపారు. సౌందరరాజన్‌ను "హిందూ వ్యతిరేకి" అని,"హిందూఫోబిక్"గా ముద్ర వేశారు. ఆమెకు నిరంతర వేధింపులు వస్తుండడంతో ఆమె కుటుంబాన్నిసురక్షితమైన ప్రాంతానికి తరలించవలసి వచ్చిందన్నారు. సౌందరరాజన్ చర్చకు రావడం కొంత మంది అగ్రవర్ణం వారికి ఇష్టం లేకపోవడంతో ఆమె ఇందుకు అర్హురాలు కాదని, ఇతర ఆరోపణలతో ఎన్నో ఫిర్యాదులు తమ ఉన్నతాధికారులకు వెళ్ళాయని చెప్పారు. "దీనికి వ్యతిరేకంగా ఉద్యోగుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించాను కానీ దీనిపై గూగుల్ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించానంటూ నాకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో గూగుల్ లో నా కెరీర్ ముగిసిపోయిందని గ్రహించి రాజీనామా చేశాను" అని తనూజా గుప్త చెప్పారు.
కంపెనీ ఎగ్జిట్ పాలసీ మేరకు పురుష ఉద్యోగులకు వేలాది డాలర్లు ఇస్తూ మహిళా ఉద్యోగులకు తక్కువ ఇవ్వడం పై నిరసన వ్యక్తం చేస్తూ ప్రారంభమైన పోరాటం తనూజను ఒక యాక్టివిస్ట్‌గా మార్చిందట. అప్పటినుంచి వివవక్షాపూరిత విధానాలపై ఉద్యోగుల తరపున నిలబడి వాదించేది.
ప్రత్యేకించి కుల వివక్ష విషయానికి వస్తే, అగ్రకుల మూలాలు కలిగి ఉన్నా గుప్తా ప్రతి వారం వైవిద్యం, సమానత్వం (డైవర్సిటీ, ఈక్వాలిటీ, ) అంశాలపై గంటలతరబడి సమయాన్ని వెచ్చించి అనేక సమస్యలు విని పరిష్కారానికి పనిచేసేవారు. సెప్టెంబర్ 2021లో, ఇద్దరు వ్యక్తులు కార్యాలయంలో కుల విషయాల గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తాము వివక్షను ఎదుర్కొంటున్నామనే విషయాన్ని గుర్తించామని చెప్పారు. ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు కూడా వస్తుండేవి. కులవివక్ష మామూలు విషయమేనని హోలోకాస్ట్ లను మార్చుకోవాలని సందేశాలు వస్తుండేవి. ఒక వేళ మారిస్తే మిగిలిన వారికి మరింత అవకాశం ఇచ్చినట్టు ఉండేది. అందుకే రాజీనామా చేశాననని చెప్పారు.
"ఒక బృందంలో, అగ్ర కుల, కుల అణచివేతకు గురైన వ్యక్తులు ఉన్నప్పుడు, కుల అణచివేతకు గురైన వ్యక్తులకు తక్కువ స్థాయి అసైన్‌మెంట్‌లు ఇవ్వడంతో పాటు వారి పట్ల భిన్నంగా వ్యవహరిస్తారు. సమావేశాలకు దూరంగా ఉంచుతారు, ఇవి నేను గూగుల్ సంస్థలోని ఉద్యోగులనుంచి విన్నాను." అని చెప్పారు. "కోడెడ్ సంభాషణలు" అని పిలిచే సమస్యలను కూడా గుప్తా ప్రస్తావించారు.
"సమస్య ఏమిటో మీరు అర్థం చేసుకోకపోతే, ఏమి జరుగుతుందో కూడా మీరు గ్రహించలేరు. 'మీ ఇంటిపేరు ఏమిటి? లాంటి ప్రశ్నలు అడగడం. మేనేజర్ ఆ ఇంటిపేరు వినగానే, 'ఓహ్, కాబట్టి మీరు ఈ కులానికి చెందినవారు - మీకు ఈ నాయకత్వ నైపుణ్యాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. అని చెప్పేవారట.
"కుల వివక్ష చిక్కులు తెలియనందుకు" తాను ప్రజలను నిందించనని గుప్తా చెప్పారు. "వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని నేను తప్పుపడుతున్నాను. ప్రజలు వివక్షకు గురవుతున్నారని విన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాల గురించి మరింత తెలుసుకోవాలని అనుకోకపోవడం, దాని గురించి ఏమీ చేయకూడదని అనుకోవడం పెద్ద సమస్య ఇప్పుడు అదే జరుగుతోంది."అన్నారు.
ఈ విషయం గూగుల్ కే ప్రత్యేకమైనది కాదని ఆమె అన్నారు. "అధిక సంఖ్యలో దక్షిణాసియా ఉద్యోగులు ఉన్నందున ఇది అనేక సంస్థలలో జరుగుతోంది. అని తనూజ గుప్తా చెప్పారు