Telugu Global
International

పోప్ బెనెడిక్ట్ XVI వాటికన్‌లో కన్నుమూత

గత 1000 ఏళ్లలో పోప్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి జర్మన్ కూడా బెనెడిక్ట్ కావడం గమనార్హం.

పోప్ బెనెడిక్ట్ XVI వాటికన్‌లో కన్నుమూత
X

క్యాథలిక్ చర్చ్ మాజీ పోప్ బెనెడిక్ట్ XVI (95) శనివారం వాటికన్ సిటీలో కన్నుమూశారు. వయో భారం కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు వాటికన్ వర్గాలు చెప్పాయి. 2013 ఫిబ్రవరి 28న పోప్ బెనెడిక్ట్ XVI తన పదవికి రాజీనామా చేశారు. వయోభారం కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 1415లో అప్పటి పోప్ జార్జ్ XII తర్వాతో రాజీనామా చేసిన పోప్‌గా బెనెడిక్ట్ XVI చరిత్ర సృష్టించారు. పోప్‌గా ఉన్న నాలుగో అతిపెద్ద వయస్కుడిగా కూడా బెనెడిక్ట్ రికార్డులకు ఎక్కారు. ఇక గత 1000 ఏళ్లలో పోప్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి జర్మన్ కూడా బెనెడిక్ట్ కావడం గమనార్హం.

ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్‌లో బెనెడిక్ట్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే రాజీనామా తర్వాత కూడా ఆయన వాటికన్‌లో నే ఉండటం వల్ల చర్చి భావజాలంలో పోలరైజేషన్ వచ్చినట్లు చెబుతుంటారు. పోప్ ఫ్రాన్సిస్ తీసుకుంటున్న ప్రొగ్రెసీవ్ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సాంప్రదాయవాదులు తరచూ బెనెడిక్ట్‌కు ఫిర్యాదు చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో.. పోప్ ఒక్కడే.. అతనే ఫ్రాన్సిస్ అంటూ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది.

జర్మనీకి చెందిన పోప్ బెనెడిక్ట్ అసలు పేరు జోసెఫ్ అలియోసిస్. ఆయన 1937 ఏప్రిల్ 16న జన్మించారు. బెనెడిక్ట్ తండ్రి నాజీలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నాజీయిజంను జోసెఫ్ ఫ్యామిలీ వ్యతిరేకించడంతో తీవ్ర వేధింపులకు గురయ్యారు. జోసెఫ్ 14వ ఏట అతడిని నాజీలు హిట్లర్ యూత్‌లో జాయిన్ చేశారు. అప్పట్లో 14 ఏళ్లు నిండిన ప్రతీ జర్మన్ పిల్లవాడు హిట్లర్ యూత్‌లో చేరాల్సిందే. కానీ జోసెఫ్‌కు మాత్రం అందులో జాయిన్ అవడం ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత జోసెఫ్ 20వ ఏట జర్మన్ ప్రీస్ట్ రొమానో గార్డినీని కలిశాడు. అతడు జోసెఫ్‌పై ఎంతో ప్రభావం చూపించాడు. యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్‌లో చదివే సమయంలో వీరిద్దరు క్యాథలిక్ చర్చ్ భవిష్యత్‌పై అనేక చర్చలు చేసేవారు.

1951లో జోసెఫ్ రాజింగర్ మ్యూనిక్‌లోని సెయింట్ మార్టిన్ ప్యారిష్‌కు చాప్లిన్ (ఫాదర్) అయ్యాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు. 1977 మార్చి 24న జోసెఫ్ మ్యూనిక్ అండ్ ఫ్రీసింగ్ ఆర్చ్ బిషప్‌గా నియమించబడ్డాడు. అదే ఏడాది జూన్‌లో కార్డినల్ ప్రీస్ట్‌గా పోప్ పాల్‌చే అభిషేకం చేయబడ్డాడు. 2005 నాటికి పోప్ పాల్ చేత కార్డినల్‌గా నియమించబడిన వారిలో కేవలం 14 మందే మిగిలారు. వారిలో జోసెఫ్ ఒకరు. 2005లో జోసెఫ్ క్యాథలిక్ చర్చ్‌కి 265వ పోప్‌గా నియమించబడ్డారు. అయితే వాటికన్ రాజకీయాలు, వయోభారంతో 2013లో రాజీనామా చేశారు.

చిన్నారులపై ఫాదర్ల లైంగిక వేధింపుల గురించి..

పోప్ బెనెడిక్ట్ XVI తన హయాంలో అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. చిన్నారులపై చర్చి ఫాదర్లు చేసే లైంగిక వేధింపులపై చర్య తీసుకున్న మొదటి పోప్‌గా ఆయన గుర్తింపు పొందారు. అయితే ఈ ఏడాది బయటకు వచ్చిన ఒక నివేదిక బెనెడిక్ట్ కెరీర్‌కు మచ్చగా మారింది. 1977-82 కాలంలో మ్యూనిక్ ఆర్చ్ బిషప్‌గా ఉన్న సమయంలో నాలుగు లైంగిక వేధింపుల కేసులపై చర్యలు తీసుకోవడంలో విఫలం అయినట్లు పేర్కొన్నారు. ఇది ఆయన కావాలనే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పోప్ అయిన తర్వాత 8 ఏళ్లలో ఇలాంటి కేసులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చ్ ఫాదర్లపై వచ్చాయి. ఇవి కూడా బెనెడిక్ట్ రాజీనామాకు కారణమని కొందరు సన్నిహితులు చెబుతారు.




First Published:  31 Dec 2022 5:20 PM IST
Next Story