Telugu Global
International

నన్ను ఉగ్రవాదిలా చూస్తున్నారు..

పలు ప్రయత్నాల తరువాత ఎట్టకేల‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్‌ హైదర్‌ జైలుకి వెళ్లారు. కోర్టు తీర్పును సవాలు చేసే విషయాల్లో ఆయన ఇమ్రాన్‌తో దాదాపు గంట పాటు మాట్లాడారు.

నన్ను ఉగ్రవాదిలా చూస్తున్నారు..
X

తోషాఖానా కేసులో అరెస్ట్ అయిన‌ పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. పలు ప్రయత్నాల తరువాత ఎట్టకేల‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్‌ హైదర్‌ జైలుకి వెళ్లారు. కోర్టు తీర్పును సవాలు చేసే విషయాల్లో ఆయన ఇమ్రాన్‌తో దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు మరీ నీచంగా, దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్‌ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు.

ఇమ్రాన్‌ను ఒక చిన్న చీకటి గదిలో ఉంచారని, అందులో మరుగుదొడ్డికి ఎటువంటి గోడలు కూడా లేవని ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ ఆరోపించారు. టీవీ లేదు, వార్తాపత్రిక లేదు, పగలూ, రాత్రి ఈగలు, చీమలతో తాను సహా జీవనం చేస్తున్నానని ఇమ్రాన్ వాపోయారన్నారు. ఎవరినీ కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని, తనను ఉగ్రవాదిగా చూస్తున్నారని చెప్పారన్నారు. అయినప్పటికీ.. జీవితమంతా జైలులో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్‌ చెప్పారని న్యాయవాది నయీమ్ తెలిపారు. అసలు అరెస్టు చేసే సమయంలోనూ పోలీసులు కనీసం వారెంటు చూపించలేదని, అంతేకాకుండా తన భార్య గది తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నించారని ఇమ్రాన్‌ ఆరోపించారన్నారు.

తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించిన వెనువెంటనే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని చాలా దూరంగా ఉండే పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైలుకు తరలించారు. మరోవైపు ప్రస్తుత జాతీయ అసెంబ్లీ గడువు ఆగస్టు 12న పూర్తికానుండగా, ఆగస్టు 9 వ తేదీన రద్దు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇప్పటికే ప్రకటించారు. నేషనల్ అసెంబ్లీ రద్దయిన తర్వాత 90 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఎన్నికల ముందు ఇమ్రాన్‌కు శిక్ష, అనర్హత వేటు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది చివర్లో పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో మూడేళ్ల శిక్ష పడటంతో ఇమ్రాన్‌ రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది.

First Published:  8 Aug 2023 3:44 PM GMT
Next Story