మంచు గుప్పెట్లోనే అమెరికా.. పొంచివున్న వరద ముప్పు - పెరుగుతున్న మృతుల సంఖ్య
ఈ శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైనదిగా భావిస్తున్న ఈ మంచు తుఫాను అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించింది.
మంచు తుఫాను ప్రభావం అమెరికాను ఇంకా వీడలేదు. మంచు గుప్పెట్లోనే చిక్కుకుని అగ్రరాజ్యం అల్లాడుతోంది. ఈ శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైనదిగా భావిస్తున్న ఈ మంచు తుఫాను అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించింది. గత వారం రోజులతో పోల్చితే హిమపాతం కొంత తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. విద్యుత్ పునరుద్ధరణ, రోడ్లపై పేరుకుపోయిన మంచు తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. దీంతో మరిన్ని దారుణాలు వెలుగు చూస్తున్నాయి. కార్లలో ఉండి మంచులో చిక్కుకుపోయి ఊపిరాడక మృతిచెందినవారి మృతదేహాలు ఈ సందర్భంగా బయటపడుతున్నాయి.
వేలాదిగా విమానాల రద్దు...
అమెరికాలో రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3500 పైగా విమానాలను ముందస్తుగా రద్దు చేశారు. దీంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయి ఆ ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. బయటకు వెళ్లే పరిస్థితి లేక జనం టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు. తుఫాన్ ప్రభావం వల్ల డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది.
అనేక రాష్ట్రాల్లో ఆకలి కేకలు..
రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో నిత్యావసరాల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఇళ్లలోని ఆహార పదార్థాలు నిండుకున్నాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో లూటీలు కూడా జరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు కూడా నానా పాట్లు పడుతున్నారు.
పొంచివున్న వరద ముప్పు...
అమెరికాలో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మంచు తుఫాన్ ముప్పు నుంచి బయటపడతామని ఆశపడుతున్న ప్రజలకు మరో తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. అది వరద రూపంలో ముంచెత్తనుంది. మంచు తుఫాన్ ప్రభావం వల్ల ఎక్కడికక్కడ భారీగా పేరుకుపోయిన మంచు కరిగిపోయి ఒక్కసారిగా వెల్లువలా ముంచెత్తే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ ఇప్పటికే పలు రాష్ట్రాలను హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని సమాచారం.