ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీకి కత్తిపోట్లు..
మిడ్ నైట్ చిల్డ్రన్ నవలతో బుకర్ ప్రైజ్ అందుకున్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అమెరికాలో దాడి జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ లో చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్ స్టిట్యూట్ లో ప్రసంగించేందుకు వచ్చారు సల్మాన్ రష్దీ. స్టేజ్ పై ఉన్న ఆయన తన ప్రసంగానికి సిద్ధమవుతున్న వేళ ఆయనపై ఓ దుండగుడు సడన్ గా దాడి చేశాడు. కత్తితో పొడిచాడు, దీంతో సల్మాన్ రష్దీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఏ ఆస్పత్రిలో ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1947లో ముంబైలో జన్మించిన సల్మాన్ రష్దీ, బ్రిటన్‌లో స్థిరపడ్డారు. గ్రీమ్స్ అనే నవలతో ఆయన సాహితీ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 1981లో మిడ్ నైట్ చిల్డ్రన్ నవల ఆయనకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఆ నవలకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ వరించింది. ఆ తర్వాత తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు సల్మాన్ రష్దీ. ది సాతానికి వెర్సెస్ (సాతాను ప్రవచనాలు) అనే గ్రంథం ఆయన్ను విమర్శలకు కేంద్ర బిందువుగా మార్చింది. ఈ పుస్తకం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ పెద్ద గొడవలు జరిగాయి. సల్మాన్ రష్దీని చంపేందుకు ఫత్వా కూడా జారీ చేశారు. మతాన్ని కించపరుస్తోందని పేర్కొంటూ 1988 నుంచి ఇరాన్ లో ఈ పుస్తకాన్ని నిషేధించారు.
వ్యక్తిగత జీవితం..
సల్మాన్ రష్దీ నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నలుగురికీ విడాకులిచ్చారు. 75 ఏళ్ల వయసున్న ఈ రచయిత ప్రస్తుతం పియా గ్లెన్ అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన నవలల ద్వారా ప్రశంసలు అందుకున్న ఈయన, అదే స్థాయిలో వివాదాలకు కేంద్రబిందువయ్యారు. ప్రస్తుతం కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.