రోజుకు రెండు గంటలకన్నా ఎక్కువ సోషల్ మీడియా వినియోగిస్తే డిప్రెషన్ తప్పదు
సోషల్ మీడియా అతి వినియోగం వల్ల యువత డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ అధ్యయనం స్పష్టం చేసింది. రోజుకు రెండు గంటలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాను వినియోగించవద్దని ఆ అధ్యయనం సూచించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రజల జీవితంలో భాగమయిపోయింది. ముఖ్యంగా యువత దీనికి దాదాపు ఎడిక్ట్ అయిపోతున్నారు. దాంతో ఎక్కువ గంటలు సోషల్ మీడియాలో గడిపేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. అయితే ఎక్కువ గంటలు ఇలా సోషల్ మీడియాలో గడపడవల్ల డిప్రెషన్ వస్తుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది.
'జర్నల్ ఆఫ్ అఫెక్టివ్ డిజార్డర్స్'లో ప్రచురించిన ఈ అధ్యయనంలో సోషల్ మీడియా వినియోగం, వ్యక్తిత్వ నిర్మాణం, డిప్రెషన్ పెరగడం మధ్య అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. గతంలో పలు అధ్యయనాలు డిప్రెషన్ కు అనేక అంశాలు కారణమని తేల్చగా, తాజా అధ్యయనం సోషల్ మీడియా వల్ల వచ్చే డిప్రెషన్ ను గుర్తించే ప్రయత్నం చేసింది.
ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించే యువకులు తమ వ్యక్తిత్వం తో సంబంధం లేకుండా ఆరు నెలల్లో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందని ఈ స్టడీలో కనుగొన్నారు.
ఈ అధ్యయనం మెర్రిల్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలోని కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హ్యూమన్ సైన్సెస్ డీన్ బ్రియాన్ ప్రిమాక్, అలబామా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన చున్హువా కావోతో కలిసి చేశారు.
సోషల్ మీడియాను తక్కువ వినియోగించే వారితో పోలిస్తే, ఎక్కువగా చూసే వారికి 49 శాతం అధిక డిప్రెషన్ రిస్క్ ఉందని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే, సాధారణ వ్యక్తులతో పోలిస్తే నరాల సంబంధ వ్యాధులు ఉన్న వారు సోషల్ మీడియా వినియోగం కారణంగా డిప్రెషన్ బారిన పడే రిస్క్ రెండింతలు ఎక్కువగా ఉందని తేలింది. రోజులో 300 నిమిషాల కన్నా ఎక్కువగా అంటే ఐదు గంటలకు మించి అదే పనిగా సామాజిక మాధ్యమాల వినియోగం ప్రమాదకరమని ఈ స్టడీ చెప్పింది.
సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల వ్యక్తిగత సంబంధాలు తగ్గిపోతాయని, ఒక్కో సారి పూర్తిగా తెగిపోతాయని అధ్యయనం చెప్పింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కూల కంటెంట్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, వ్యక్తులు నిరాశలో కూరుకుపోతారని అధ్యయనం పేర్కొంది.
సోషల్ మీడియాలో ఎక్కువ మంది వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం వలన సంబంధాల్లో సమస్యలు వస్తాయని, తప్పుగా సంభాషించే, తప్పుగా అర్దం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనం తేల్చింది.
సామాజిక సంబంధాలు అధికంగా ఉన్నవాళ్ళు సహజమైన భావోద్వేగాలతో ఉంటారని, అదే సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడిపేవారి భావోద్వేగాలు ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటాయని ఈ స్టడీ తెలిపింది.
ప్రపంచంలో జరుగుతున్న అసహజ మరణాల్లో డిప్రెషన్ కారణంగా ఎక్కువ మరణాలు ఉంటున్నాయని దానికి సోషల్ మీడియా కూడా ఒక ముఖ్యమైన కారణమవుతుందని అధ్యయనం తెలిపింది.
గంట, రెండు గంటలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో గడపవద్దని, అదికూడా కంటిన్యూగా చూడవద్దని ఈ స్టడీ సూచించింది.
అమెరికాలోని 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,000 కన్నా ఎక్కువ మంది పైన ఈ అధ్యయనం జరిగింది.