Telugu Global
International

వడగాడ్పులతో హీటెక్కిపోతున్న యూరప్.. ఎయిర్ పోర్టుల్లో నరకం చూస్తున్న ట్రావెలర్స్

విపరీతమైన‌ ఎండలు, వేడి గాలులతో యూరప్ మండిపోతోంది. ప్రజలు చల్లని ప్రాంతాలకు పోవడానికి విమానాశ్రయాలకుపరుగులు తీస్తున్నారు. దాంతో అక్కడి విమానాశ్రయాలు రైల్వే ప్లాట్ ఫారాలను తలపిస్తున్నాయి.

వడగాడ్పులతో హీటెక్కిపోతున్న యూరప్.. ఎయిర్ పోర్టుల్లో నరకం చూస్తున్న ట్రావెలర్స్
X

యూరప్ అంతటా వడగాడ్పులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతుంటే భరించలేం బాబోయ్ అంటూ బడాబాబులంతా చల్లని దేశాలకు వెళ్లేందుకు తహతహలాడుతున్నారు. లండన్ లోని హీత్రో విమానాశ్రయం తో బాటు ఆమ్ స్టర్ డామ్ లోని షిఫాల్ ఎయిర్ పోర్ట్, ఇంకా బ్రసెల్స్ ఎయిర్ పోర్ట్, ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్.. ఇలా అనేక దేశాల్లోని విమానాశ్రయాలు .. రైల్వే ప్లాట్ ఫారాలను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా జనం..జనం ! అలాగే సముద్ర మార్గాన ఏ నౌకలోనైనా చెక్కేద్దామనుకుంటున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. విమానాశ్రయం రద్దీగా ఉంది కదా ఏ పోర్టుకైనా వెళ్లి ఏ షిప్ అయినా ఎక్కుదామనుకుంటే అక్కడా సేమ్ సీన్ ! ఇక ఎయిర్ పోర్టుల విషయానికి వస్తే. వచ్చి పడుతున్న జనాలను చూసి నోరెళ్లబెడుతున్న అధికారులు మరేమీ చేయలేక అనేక సర్వీసులను రద్దు చేస్తున్నారు. చాలా జాప్యం కూడా జరుగుతుండడంతో .. అధికారుల మీద ప్రయాణికులు భగ్గుమంటున్నారు. లండన్ నుంచి దుబాయ్ కి విమానంలో వెళ్ళిపోదామని హీత్రో విమానాశ్రయానికి చేరుకున్న జనాలు ఖంగు తిన్నారు. కారణం ? ట్రాఫిక్ విపరీతంగా ఉందని, అందువల్ల పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తామని ఎయిర్ పోర్టు అధికారులు చెప్పడంతో అంతా ఉసూరుమన్నారు. రెండేళ్ల క్రితం కోవిడ్ పాండమిక్ స్వైర విహారం చేసినప్పుడు కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ఏవియేషన్ ఇండస్ట్రీ కకావికలమైందంటే అతిశయోక్తి లేదు. చాలా కాలం పాటు విమానాలు ఎయిర్ పోర్టుల్లోనే ఉండిపోయాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు సిబ్బందికి యాజమాన్యాలు పింక్ స్లిప్స్ ఇచ్చాయట.. కోవిడ్ కాస్త నెమ్మదించేసరికి తిరిగి ప్రయాణికుల రద్దీ పెరుగుతూ వచ్చింది. కానీ ఇందుకు తగినట్టు ఎయిర్ లైన్స్ సిబ్బంది లేదా విమాన స్టాఫ్ లేకపోవడంతో మళ్ళీ చిక్కులు వచ్చి పడ్డాయి. పైగా తమ వేతనాలు, అలవెన్సులు పెంచాలంటూ ఎయిర్ పోర్ట్, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆందోళన చేపట్టిన ఫలితంగా ఫ్లైట్ ఆపరేషన్లు కుదేలయ్యాయి.

ఆశ్చర్యమేమిటంటే లేబర్ కొరత కారణంగా ప్యాసింజర్ల లగేజీని సిబ్బంది సకాలంలో విమానంలోకి లోడ్ చేయలేకపోతున్నారట. దీంతో చాలా విమానాలు ప్రయాణికుల లగేజీ లేకుండానే డెస్టినేషన్లకు ఎగురుతున్నాయని హీత్రో విమానాశ్రయ అధికారి ఒకరు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ప్యాసింజర్ల క్యూలు చాంతాడంత ఉంటున్నాయి. చాలామంది తమ విమానాలను మిస్సయ్యారు. యూరప్ కి బ్రిటన్ గేట్ వే గా పిలుస్తున్న 'పోర్ట్ ఆఫ్ డోవర్' కి వెళ్లాల్సిన విమానం నిన్న సకాలంలో వెళ్లలేకపోయింది. ఇక ముఖ్యంగా ప్రయాణికులకు, ఎయిర్ పోర్ట్ అధికారులకు మధ్య టగ్ ఆఫ్ వార్ మొదలయింది. నాలుగు గంటలకు పైగా ఆలస్యం జరిగిందని వీళ్ళు (ప్రయాణికులు), మేమేం చేయలేమని వాళ్ళు (అధికారులు) చెప్పడంతో వార్ వంటి పరిస్థితి తలెత్తింది. పులి మీద పుట్రలా .. మీరు ప్యాసింజర్ల సంఖ్యను ఎందుకు తగ్గించారంటూ ఎమిరేట్స్ అధికారులు ఈ నెల 14 న హీత్రో విమానాశ్రయ సిబ్బందికి తీవ్రమైన పదజాలంతో ఓ స్టేట్ మెంట్ ని జారీ చేశారు. మా విమానాల్లో చాలినంత కెపాసిటీ ఉందని, మీ చేతగానితనం వల్ల ఎన్నడూ చూడని పరిస్థితినెదుర్కొన్నామని వారు దుయ్యబట్టారట.




First Published:  23 July 2022 2:28 PM IST
Next Story