వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు!
డెమోక్రాట్లపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా హయాంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్).. ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళనల కోసం పలు కీలక విధానాలు తీసుకొస్తున్న విషయం విదితమే. దీంతో ఆయన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమౌతున్నది. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపాలని డెమోక్రట్లు కోరుకుంటున్నారని అన్నారు. 'డోజ్' సంస్కరణలు వారికి రుచించడం లేదని ఎద్దేవా చేశారు.
అమెరికాలో పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగమవుతున్న విషయాన్ని ఎలాన్ మస్క్ బైటపెడుతున్నారంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'డెమోక్రట్లకు ఇది బాగా అర్థమౌతుంది. మీ డబ్బు తీసుకోవడం కోసం ఎలాన్ మస్క్ రాలేదు. మీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారి చిట్టాను బైటికి తీసుకొస్తున్నారు' అని సదరు యూజర్ రాసుకొచ్చారు. దీనికి మస్క్ బదులిస్తూ ' అలా చేస్తున్నందుకే డెమోక్రట్ను నన్ను చంపాలని చూస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇది ఎంత పెద్ద విషయమో మీరే అర్థం చేసుకోవచ్చు అని రిప్లై ఇచ్చారు.
ఫెడరల్ ఉద్యోగులకు యూఎస్ ఆఫీస్ ఆప్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి మస్క్ ఓ మెయిల్ పంపారు. ఉద్యోగులందరూ గత వారం ప్రభుత్వం కోసం తాము ఏం పని చేశారో విరించాలని అలా చేయాలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మెయిల్‌కు సోమవారం రాత్రి 11.59 గంటల్లోపు ఐదు వాక్యాల్లో ఉద్యోగులు రిప్లై ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. అటు మస్క్ నిర్ణయం రిపబ్లికన్లలోనే కొంతమందికి నచ్చలేదు. దీనివల్ల దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం బైటికి వెళ్లే ప్రమాదం ఉందనే భయాలు నెలకొన్నాయి.