ట్విటర్ బాగోతం బయట పెడతా.. చర్చకు రా.. సీఈవోకు ఎలాన్ మస్క్ ఛాలెంజ్
ఎలాన్ మస్క్, ట్వీటర్ ల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ట్విటర్ ను కొంటానని ఒప్పందం చేసుకొని దాన్ని తిరస్కరించిన తర్వాత ఎలాన్ మాస్క్ పై ట్విటర్ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో ట్వీటర్ ఫేక్ అకౌంట్లపై చర్చకు రావాలని ఆసంస్థ సీఈఓ కు ఎలాన్ మస్క్ సవాల్ విసిరాడు.
టెస్లా కార్ల అధినేత. బిలియనీర్ ఎలాన్ మస్క్ ..ట్విటర్ మీద యుద్ధం ప్రకటించాడు. ఏకంగా ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ నే సవాల్ చేశాడు. మీ సంస్థ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తోందని, స్పామ్ బోట్స్ ఎస్టిమేషన్ లోపభూయిష్టంగా ఉందని ఆరోపించాడు. మీ అకౌంట్లన్నీ 'మెటీరియల్లీ ఫాల్స్' అని నిప్పులు కక్కాడు. వీటన్నింటి మీద పబ్లిక్ డిబేట్ పెడదాం.. రెడీయా అని సీఈఓ పరాగ్ అగర్వాల్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలుకు మీరు ఆఫర్ ఇచ్చారని, మరి ఎందుకు వెనక్కి తగ్గారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మస్క్ .. సమాధానమిస్తూ.. ఇదిగో.. ఇవీ కారణాలన్నట్టు వివరించాడు. ఇదే సమయంలో అగర్వాల్ కి ఛాలెంజ్ విసిరాడు. ప్రస్తుతం ట్విటర్, మస్క్ మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది.
మస్క్ పై ట్విటర్ కోర్టుకెక్కితే.. ఈయన కూడా దానిమీద దావా వేశాడు. మస్క్ తరఫున డేటా ఎనలిస్టు, స్పేస్ ఎక్స్ అభిమాని యాండ్రియా స్ట్రోపా . . ట్వీట్ చేస్తూ స్పామ్, ఫేక్ అకౌంట్లపై మరింత సమాచారం కావాలని తమ సన్నిహితుడు (మస్క్) కోరితే ట్విటర్ కాలం చెల్లిన డేటా ఇచ్చిందని, పైగా అది 'ఫేక్ సెట్ ఆఫ్ డేటా' అని ఆరోపించాడు. ఇందుకు స్ట్రోపాను మస్క్ అభినందించాడు. మంచి ప్రశ్న అడిగావు.. .. సమస్యకిది మంచి సమ్మరీ అని రీట్వీట్ చేశాడు. బోట్ పర్సెంటేజ్ గురించి చర్చిద్దాం రమ్మంటూ పరాగ్ అగర్వాల్ ని కోరాడు. ఇంతటితో ఆగలేదు. ట్విటర్ పై మస్క్ ఇదే రోజున పోల్ నిర్వహించాడు కూడా.. ఈ పోల్ లో 8 లక్షలమందికి పైగా యూజర్లు పాల్గొనడం విశేషం. వీరిలో 64.9 శాతం మంది.. ట్విటర్ అకౌంట్లన్నీ ఫేక్ అని నమ్ముతున్నామన్నారు.
స్పామ్, బోట్ ప్రొఫైల్స్ కి సంబంధించి ట్విటర్ సరైన . కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదంటూ ఎలాన్ మస్క్ దీని కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గాడు. తన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. అయితే డైలీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ ప్రొఫైల్స్ మహా అయితే 5 శాతం మాత్రమే ఉంటారని, వ్యక్తులను ట్రోల్ చేయడానికి స్పామ్ బోట్స్ ని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంది. అసలైన వ్యక్తులు నిర్వహించే అకౌంట్లు చాలానే ఉంటాయని.. తరచూ వారు చేసే ట్వీటింగ్ అలవాట్ల కారణంగా అవి స్పామ్ ప్రొఫైల్స్ మాదిరి కనిపిస్తే కనిపించవచ్చునని అభిప్రాయపడింది. తనను ట్విటర్ మోసగించిందంటూ మస్క్ .. ఇటీవలే డెలావర్ కోర్టులో దావా వేశాడు. ఆ సంస్థ ఇండియాలోని స్థానిక చట్టాలను ఫాలో కావాలని తన డాక్యుమెంట్లలో కోరాడు. ఇక ట్విటర్ సైతం ఈయనపై కోర్టుకెక్కింది. 44 బిలియన్ డాలర్లతో తమ సంస్థను కొంటామని చెప్పి మస్క్ తమను వంచించాడని, ఇది తప్పించుకునే ఒప్పందం కాక మరేమిటని తమ పిటిషన్ లో పేర్కొంది.