మరి కొన్ని గంటల్లో ఎన్నికలు.. పాకిస్థాన్‌లో పేలుళ్లు.. 25 మంది మృతి..
సార్వత్రిక ఎన్నికల వేళ పాకిస్థాన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది
సార్వత్రిక ఎన్నికల వేళ పాకిస్థాన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అసలే రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. అయితే పోలింగ్‌కు ఒక్క రోజు ముందు పేలుడు సంఘటనలు జరిగాయి. బలూచిస్థాన్‌లోని పిషిన్ ప్రాంతంలోని స్వతంత్ర అభ్యర్థి అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ కార్యాలయం వెలుపల జరిగిన పేలుడులో 17 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. సంఘటన జరిగిన ఒక గంట లోపే, కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్-ఉలేమా ఇస్లాం-పాకిస్థాన్ ఎన్నికల కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు ఈ దాడుల వెనుక ఎవరున్నారన్నది స్పష్టం కాలేదు. అయితే ఉగ్రవాదులు, బబూచిస్థాన్ వేర్పాటు వాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలింగ్ స్టేషన్‌లకు ప్రజలు వెళ్లకుండా ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా భద్రతా సిబ్బందిని మరింత పెంచుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఈ పేలుళ్లపై ఎన్నికల సంఘం స్పందించింది. బలూచిస్థాన్ చీఫ్ సెక్రటరీ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను తక్షణ నివేదికలను ఇవ్వాలని కోరింది. సంఘటనల వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
2018 సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా గెలిచారు. ఆ తర్వాత ఆయనపై తిరుగుబాటు మొదలుకావటంతో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుండి తొలగించబడ్డారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం అధికారికంగా మంగళవారం రాత్రి ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తుంది.